నత్తలను సంతోష పెట్టండి.. సంతోషంగా ఉండండి

19 May, 2018 09:49 IST|Sakshi

బ్యాంకాక్‌ : నత్తలను సంతోష పెట్టండి.. మీరు కూడా సంతోషంగా ఉండండి. ఇది నేను చెబుతున్న మాట కాదు థాయ్‌లాండ్‌లోని ప్రముఖ కాస్మోటిక్‌ కంపెనీలు చెబుతున్న మాట. ఎలాగంటారా?.. థాయ్‌లాండ్‌లో నత్తలతో చేసే వైద్యం బాగా ప్రాచుర్యం పొందింది. అయితే ఈ మధ్య నత్తల నుంచి ఉత్పత్తి అయ్యే శ్లేష్మానికి కూడా విపరీతంగా డిమాండ్‌ పెరిగిపోయింది. దీంతో నత్తలను పెంచడానికి థాయ్‌ రైతులు ఎగబడిపోతున్నారు. కాస్మోటిక్‌ కంపెనీలు సైతం నత్తల శ్లేష్మం కోసం ఎక్కువ డబ్బు కేటాయిస్తున్నారు.

అంతేకాదు రైతులను కూడా నత్తల పెంపకంపై తగిన శ్రద్ధ తీసుకునేలా శిక్షణ ఇస్తున్నాయి. ఈ నత్తల శ్లేష్మంతో తయారైన క్రీములకు దేశ విదేశాల్లో విపరీతమైన డిమాండ్‌ ఉండటంతో డబ్బుకు వెనకాడటం లేదు కంపెనీలు. నత్తల పెంపకంలో స్థిరపడ్డ రైతులు నెలకు వేలల్లో ఆదాయం వస్తోంది. థాయ్‌లాండ్‌ ప్రజల కనీస ఆదాయానికి మించి ఐదు రెట్లు ఎక్కువ లాభాలు పొందుతున్నారు అక్కడి నత్తల రైతులు.

నత్తలను ఆహ్లాదకరమైన వాతారణంలో పెంచడం ద్వారా వాటి నుంచి ఉత్పత్తి అయ్యే శ్లేష్మం కూడా నాణ్యంగా ఉంటుందని, నాణ్యమైన శ్లేష్మానికి ఎక్కువ ధర ఉంటుందని థాయ్‌ రైతులు అంటున్నారు. ఈ వ్యాపారానికి ఎలాంటి పెట్టుబడి లేకపోవడం కూడా రైతులను ఆకర్షిస్తోంది. దక్షిణ కొరియా, చైనా, థాయ్‌లాండ్‌ తదితర దేశాలలో ఉపయోగించే సౌందర్య ఉత్పత్తుల్లో నత్తల శ్లేష్మాన్ని ఎక్కువగా వాడుతుంటారు.

మరిన్ని వార్తలు