ఆవిరి స్నానంతో గుండెపోటుకు చెక్‌!

3 May, 2018 23:07 IST|Sakshi

లండన్‌ : తరచూ ఆవిరి స్నానం చేసేవారికి గుండెపోటు వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నట్లు ఓ పరిశోధనలో తేలింది. అమెరికాలోని కేంబ్రిడ్జ్‌ , యూకేలోని యూనివర్సిటీ ఆఫ్‌ బ్రిస్టల్‌ తదితర వర్సిటీలకు చెందిన పరిశోధకుల బృందం దాదాపు 15 ఏళ్ల పాటు నిర్వహించిన ఓ అధ్యయనం ఈ విషయాన్ని వెల్లడించింది. దీనికోసం 53 నుంచి 74 ఏళ్ల లోపు వయసున్న 1,628 స్త్రీ, పురుషులు వారానికి చేసే ఆవిరి స్నానాల సంఖ్య ఆధారంగా విభజించి పరిశీలించింది.

ఇందులో వారానికి ఒకసారి ఆవిరి స్నానం చేసేవాళ్లతో పోలిస్తే రెండు, మూడు సార్లు చేసేవాళ్లలో 14శాతం, నాలుగు నుంచి ఏడుసార్లు చేసేవాళ్లలో 61శాతం గుండెపోటు ముప్పు తక్కువైనట్లు తేల్చింది. దీనికి కారణం ఆవిరి స్నానంతో బీపీ తగ్గడం, రోగ నిరోధకత, నాడీ వ్యవస్థ, హృదయ స్పందనల తీరు మెరుగుపడడం అని గుర్తించింది. కాగా, అంతకుముందు ఇదే పరిశోధకుల బృందం చేసిన మరో అధ్యయనంలోనూ బీపీ, హృదయ స్పందనలపై ఆవిరి స్నానం ప్రభావం చూపుతుందని వెల్లడి కావడం గమనార్హం.

>
మరిన్ని వార్తలు