Heart Attack Risk : అర్థరాత్రి దాటాక నిద్రపోతున్నారా? మీ గుండె రిస్క్‌లో పడ్డట్లే!

8 Dec, 2023 15:00 IST|Sakshi

ప్రస్తుతం మారుతున్న జీవనశైలి కారణంగా అనేక అనారోగ్యాల బారిన పడుతున్నాం. ముఖ్యంగా ఇటీవలి కాలంలో గుండెపోటు సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. భారత్‌లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఈ మధ్య కాలంలో చిన్న వయసులోనే పలువురు గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే నిద్రవేళల్లో కొన్ని మార్పులు చేసుకుంటే హార్ట్‌ రిస్క్‌ తగ్గుతుందని యూరోపియన్ హార్ట్ జర్నల్‌లో ప్రచురించిన ఓ అధ్యయనంలో తేలింది. ఇంతకీ నిద్రకు ఏ సమయం మంచిది? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

ఆరోగ్యకరమైన జీవనశైలి ద్వారా 80% కంటే ఎక్కువ గుండె జబ్బులను నివారించవచ్చని మీకు తెలుసా? ధూమపానం మానేయడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ఫైబర్‌ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యానికి మంచిది అన్న విషయం తెలిసిందే.

అయితే తాజాగా ఓ అధ్యయనం ప్రకారం.. రాత్రిపూట ఆలస్యంగా నిద్రపోయే వారిలో గుండెజబ్బులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని తేలింది.ఈ రీసెర్చ్‌ కోసం సుమారు 88వేల మందిని పరిశీలించారు. ఇందులో 60% మంది మహిళల వయసు దాదాపు 61 ఏళ్లుగా ఉంది. వీరిలోరాత్రి 10-11 గంటల లోపు నిద్రపోయే వారిలో హార్ట్‌ రిస్క్‌ తక్కువగా ఉందని తేలింది.

అర్థరాత్రి దాటిన తర్వాత నిద్రపోయిన వారిలో గుండెజబ్బులు వచ్చే ప్రమాదం సుమారు 24% ఎక్కువగా ఉంది. అందుకే రాత్రిళ్లు త్వరగా నిద్రపోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా ప్రతిరోజూ సుమారు 7-8గంటలకు తగ్గకుండా, రోజూ ఒకే సమయంలో నిద్రపోవడం మరింత మంచిదంటున్నారు. 

>
మరిన్ని వార్తలు