ప్రవాహం ఆగింది..!

24 Sep, 2017 03:11 IST|Sakshi

రోహింగ్యాల ప్రవాహం ఆగిందన్న బంగ్లాదేశ్‌

రెండు రోజుల నుంచి కనిపించడం లేదని సైన్యం ప్రకటన

ఢాకా : రోహింగ్యా వలసలకు కాస్త విరామం వచ్చిందని బంగ్లాదేశ్‌ శనివారం ప్రకటించింది. మయన్మార్‌లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డ తరువాత.. ఇప‍్పటివరకూ బంగ్లాదేశ్‌కు సుమారు 4 లక్షల 30 వేల మంది రోహింగ్యాలు శరణార్థులుగా వచ్చారని ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. బంగ్లా-మయన్మార్‌ సరిహద్దు ప్రాంతంలో ఏర్పాటు చేసిన శరణార్థి శిబిరాల్లో రోహింగ్యాలు కిక్కిరిసి ఉన్నారని ఐక్యరాజ్య సమితి, బంగ్లాదేశ్‌ అధికార వర్గాలు చెబుతున్నాయి.

రెండు రోజుల నుంచి మయన్మార్‌ సరిహద్దుల నుంచి, నాఫ్‌ నదినుంచి శరణార్థులు రావడం లేదని సరిహద్దు భద్రతా బలగాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితిని గమనిస్తుంటే.. ఇక రోహింగ్యా శరణార్థుల ప్రవాహం ఆగినట్టే ఉందని బోర్డర్‌ గార్డ్‌ బంగ్లాదేశ్‌ (బీజీబీ) కమాండర్‌ ఎస్‌.ఎం. ఆరిఫుల్‌ ఇస్లామ్‌ చెప్పారు. ఇదిలా ఉండగా.. శరణార్థుల సంఖ్యను రోజువారీ గణాంకాలను వెల్లడించాలని ఐక్యరాజ్యసమితి కోరినట్లు ఆయన చెప్పారు. సమితి తీసుకున్న చర్యల వల్లనే రోహింగ్యాల ప్రవాహానికి అడ్డుకట్ట పడి ఉండొచ్చని ఆయన అన్నారు. రోహింగ్యా మిలిటెంట్ల ఏరివేతను ఆపుతన్నట్లు మయన్మార్‌ నేత ఆంగ్‌సాన్‌ సూకీ గత వారం చేసిన ప్రకటనతో కొంతవరకూ ఫలితం వచ్చి ఉంటుందని మరో అధికారి మంజ్రుల్‌ హసన్‌ ఖాన్‌ చెప్పారు.

ఆగస్టు 25న పోలీస్‌ పోస్ట్‌లపై రోహింగ్యా మిలిటెంట్లు దాడి చేసిన తరువాత.. సైన్యం ప్రతీకార చర్యలకు దిగడంతో మయన్మార్‌లో ఉద్రిక్త పరిస్థితులు చెలరేగాయి. దీంతో రోహింగ్యాలు మయన్మార్‌ను వీడి బంగ్లాకు శరణార్థులుగా వెళ్లారు.

మరిన్ని వార్తలు