11వేల కార్మికులపై కేసులు నమోదు.. 150 ఫ్యాక్టరీలు మూసివేత

13 Nov, 2023 15:49 IST|Sakshi

బంగ్లాదేశ్‌లో వస్త్ర పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులు తమ వేతనాలు పెంచాలని నిరసన తెలుపుతున్నారు. దేశవ్యాప్తంగా గత రెండు వారాలుగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. గార్మెంట్‌ ఇండస్ట్రీలోని దాదాపు 40లక్షల మంది కార్మికులు వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ రోడెక్కారు. దాంతో అక్కడ హింసాత్మక వాతావరణం నెలకొంది.

ఫలితంగా నిరసనకారులు, భద్రతా సిబ్బంది మధ్య జరిగిన తీవ్ర ఘర్షణల వల్ల ముగ్గురు కార్మికులు మరణించినట్లు సమాచారం. అక్కడి పరిస్థితులను నియంత్రించేందుకు పోలీసులు టియర్ గ్యాస్, రబ్బర్ బుల్లెట్లను ప్రయోగించారని కార్మిక సంఘాలు ఆరోపించాయి. నిరసనకు పాల్పడిన 11,000 మంది కార్మికులను పోలీసులు అరెస్టు చేసి వివిధ సెక్షన్లకింద కేసులు నమోదు చేశారు. దాంతో దేశంలోని 150 ఫ్యాక్టరీలు నిరవధికంగా మూసివేసినట్లు మీడియా కథనాలు వెల్లడించాయి.

కార్మికుల సమస్యలు ఇవే..

బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థలో గార్మెంట్ పరిశ్రమ పాత్ర కీలకం. ఇది దేశం మొత్తం ఎగుమతుల్లో 84% వాటాను కలిగి ఉంది. కరోనా సమయంలో దుస్తుల డిమాండ్‌ మందగించింది. దానివల్ల దేశంలో 2020లో దాదాపు 17% వస్త్ర ఎగుమతులు తగ్గాయి.  ముడిచమురు ధరలు పెరగడంతో బంగ్లాదేశ్‌ ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ సవాళ్లతో పాటు ప్రధానంగా అక్కడి కార్మికులకు అరకొర జీతాలిచ్చి సరిపెడుతున్నారు.

నెలకు కనీస వేతనం కింద రూ.9458(12,500 టాకాలు) చెల్లిస్తున్నారు. అయితే దాన్ని రూ.17400(23,000 టాకాలు)కు పెంచాలని డిమాండ్‌ చేస్తున్నారు. అక్కడి పనిప్రదేశాల్లో సరైన వెంటిలేషన్‌ లేకపోవడంతో పరిశ్రమల్లోని విషపూరిత వాయువులను పీల్చి చాలామంది కార్మికులు వివిధ వ్యాధుల బారినపడుతున్నట్లు కార్మికసంఘాలు తెలిపాయి. అక్కడి కార్మికుల్లో మహిళలు ఎక్కువగా పనిచేస్తుంటారు. కానీ వారికి సరైన మౌలికవసతులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిత్యం ఏదో ఒక పరిశ్రమలో మహిళలు లైంగికహింసకు గురవుతున్నట్లు కార్మిక సంఘాలు తెలిపాయి.

ఇదీ చదవండి: ఇకపై అరచేతిలో సమాచారం.. ఏఐ పిన్‌ ఎలా పనిచేస్తుందంటే..

బంగ్లాదేశ్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న పద్దెనిమిది గ్లోబల్ కంపెనీలు అక్కడి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ప్రధానికి లేఖ రాశాయి. వారి ప్రాథమిక అవసరాలను తీర్చడానికి కొత్త కనీస వేతనం నిర్ణయించాలని కోరాయి. హెచ్‌ అండ్‌ ఎం, లెవీస్, గ్యాప్, పూమా.. వంటి ప్రతిష్టాత్మక కంపెనీలు అక్కడ పరిశ్రమలు నెలకొల్పాయి.

మరిన్ని వార్తలు