ఆత్మాహుతి దాడిలో 31మంది మృతి

22 Apr, 2018 16:10 IST|Sakshi
ప్రమాద స్థలంలోని దృశ్యం

కాబూల్‌ : ఆత్మాహుతి దాడితో అఫ్గానిస్తాన్‌ మరోసారి ఉలిక్కిపడింది. తాజాగా అఫ్గాన్‌ రాజధాని కాబూల్‌లో ఆదివారం జరిగిన ఆత్మాహుతి దాడిలో 31 మంది మృతి చెందగా, మరో 50 మందికి పైగా గాయపడ్డారు. ఈ విషయాన్ని స్థానిక అధికారులు ధృవీకరించారు. కాబూల్‌లోని ఓటరు నమోదు కేంద్రం ప్రవేశ మార్గంలో ఈ దాడి జరిగినట్టు అధికారులు తెలిపారు. బాధితుల్లో ఎక్కువ మంది మహిళలు ఉన్నట్టు సమాచారం. ఇప్పటివరకు ఈ దాడికి పాల్పడింది ఎవరనేది తెలియరాలేదు. తాలిబన్‌ ఉగ్ర సంస్థ మాత్రం దీంతో తమకు ఎలాంటి సంబంధం లేదని ప్రకటించింది.

అక్టోబర్‌లో జరగనున్న పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం ఈ నెల 14 నుంచి దేశవ్యాప్తంగా ఓటరు నమోదు కార్యక్రమాన్ని చేపట్టింది. ఓటరు నమోదు కేంద్రం వద్ద ఉన్న జనసమూహాన్ని లక్ష్యంగా చేసుకుని ఓ గుర్తు తెలియని దుండగుడు ఈ దారుణానికి పాల్పడినట్టు తెలుస్తోంది. చివరిసారిగా కాబూల్‌లో ఈ ఏడాది మార్చి 21న ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దుర్ఘటనలో 29 మంది మృత్యువాత పడ్డ విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు