ఇండో-పాక్ సిరీస్ పై నేడే ప్రకటన!

9 Dec, 2015 09:38 IST|Sakshi
ఇండో-పాక్ సిరీస్ పై నేడే ప్రకటన!

ఇస్లామాబాద్: పాకిస్థాన్ పర్యటనలో ఉన్న భారత విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్ బుధవారం ఆ దేశ ప్రధాని నవాజ్ షరీఫ్, ఆయన సలహాదారు సర్తాజ్ అజీజ్ తో భేటీ కానున్నారు. ఇరు దేశాల సంబంధాలు పెంపొందించే విషయమై ప్రధానంగా వీరు చర్చించనున్నారు. అఫ్గనిస్థాన్ అంశంపై ఐదో మినిస్ట్రియల్ సదస్సు 'హార్ట్ ఆఫ్ ఆసియా'లో పాల్గొనేందుకు సుష్మా రెండు రోజుల పాకిస్థాన్ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే.  ఇరుదేశాల దౌత్య సంబంధాలు మరింత పెంపొందించేందుకే కృషి జరుగుతున్నదని, అందులోభాగంగానే పాకిస్థాన్ ప్రధాని షరీఫ్, ఆయన సలహాదారు సర్తాజ్ అజీజ్ తో తాను సమావేశమై దౌత్య విషయాలు చర్చించనున్నట్టు సుష్మా తెలిపారు.

మంగళవారం రాత్రి సర్తాజ్ అజీజ్ విదేశీ ప్రతినిధులకు ఇచ్చిన విందులో సుష్మ కూడా పాల్గొన్నారు.  అఫ్గన్ అంశంతోపాటు ఆసియాలో భద్రతకు పొంచి ఉన్న ముప్పు, ప్రాంతీయ అనుసంధానంపై చర్చించేందుకు 'హార్ట్ ఆఫ్ ఆసియా' ఐదో సదస్సు జరుగుతున్నది. ఈ సదస్సులో 14  ఆసియా దేశాలు, 17 మద్దతు దేశాలు, 12 అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు పాల్గొంటున్నారు. సుష్మ పాకిస్థాన్ పర్యటన సందర్భంగా బుధవారమే భారత్-పాకిస్థాన్ క్రికెట్ సిరీస్ గురించి ప్రకటన చేసే అవకాశముందని తెలుస్తున్నది. తటస్థ వేదికల్లో భారత్-పాకిస్థాన్ క్రికెట్ సిరీస్ నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయించిన సంగతి తెలిసిందే. మరోవైపు 26/11 ముంబై దాడుల ఘటనపై లాహోర్ కోర్టులో బుధవారం విచారణ జరుగనుంది.
 

మరిన్ని వార్తలు