భర్త వదిలేశాడు.. దెయ్యం వేధించింది..

1 Mar, 2016 18:25 IST|Sakshi
భర్త వదిలేశాడు.. దెయ్యం వేధించింది..

బేబీ సిస్టర్(ఆయా)గా చిన్నారులను ఆడించాల్సిన ఆమె.. అత్యంత కర్కశంగా నాలుగేళ్ల పాపాయిని గొంతునులిమి చంపింది. కత్తితో తల నరికి, దాన్ని పట్టుకుని రోడ్డుపైకొచ్చి ఊరిని పేల్చేస్తానంటూ వీరంగం సృష్టించింది. సోమవారం మాస్కో నగరంలో కలకలం సృష్టించిన ఈ హత్యోదంతం.. నిందితురాలి నేరాంగీకారంతో మరింత సంచలనాత్మకంగా మారింది.

మాస్కో నగరం పశ్చిమ ప్రాంతంలోని ఓ అపార్ట్ మెంట్ లో మెషెర్యాకోవా అనే ఇల్లాలు భర్త, 15 ఏళ్ల కొడుకు, 4 ఏళ్ల కూతురితో ఉంటోంది. పాపాయి ఆలనాపాలనా చూసుకునేందుకు గ్యుల్ చెహరా బబొకులోవా(38)అనే మహిళను బేబీ సిస్టర్(ఆయా)గా నియమించారు. సోమవారం పాపను ఆయాకు అప్పగించి బయటికి వెళ్లొచ్చిన మెషెర్యాకోవా.. తిరిగొచ్చేసరికి తమ ఫ్లాట్ తగలబడిపోవటం చూశారు. ఫైరింజన్ వచ్చి మంటలు ఆర్పేలోపే ఇంకో షాకింగ్ వార్త తెలిసింది.. బేబీ సిస్టర్ గా పనిచేస్తోన్న బబోకులోవా.. 4ఏళ్ల చిన్నారి న్యాస్తాను చంపేసిందని! కర్కషరీతిలో చిన్నారి తల నరికి చేతిలో పట్టుకుని రోడ్డుపై సంచరించిన బబొకులోవాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 16 గంటల సుదీర్ఘ విచారణలో నిందితురాలు బబోకులోవా నేరం అంగీకరించింది. హత్య ఎలా చేసిందో, ఎందుకు చేసిందో వెల్లడించింది..

'మాది ఉజ్బెకిస్థాన్. భర్త ముగ్గురు పిల్లలతో చాలాకాలంపాటు నా జీవితం ఆనందంగా గడిచింది. అయితే కొద్ది కాలం కిందట నా భర్తతో పడక రష్యా వచ్చేశాను. నేను ఉండగానే ఆయన ఇంకోపెళ్లి చేసుకున్నాడు. రెండో భార్యగా ఉండటం నాకు ఇష్టం లేదు. అందుకే పిల్లల్ని ఆయన దగ్గరే వదిలేసి మాస్కో వచ్చేశా. పిల్లల్ని ఎలా ఆలించాలో ముగ్గురుపిల్లల తల్లిగా నాకు బాగా తెలుసు. అందుకే బేబీ సిస్టర్ గా పనిచేద్దామనుకున్నా. మాస్కో వచ్చిన కొద్దిన రోజులకే మెషెర్యాకోవా ఇంట్లో పని దొరికింది. బస కూడా అక్కడే. చిన్నారి న్యాస్తాను బాగా చూసుకునేదాన్ని. అయితే కొద్ది రోజులుగా నాకు వింత శబ్ధాలు వినిపించేవి.

 

ఒంటరిగా ఉన్నప్పుడు, పడుకున్నప్పుడు కలలో ఎవరో నాతో మాట్లాడేవాళ్లు. ఆదేశిస్తున్నట్లుగా గద్దించేవాళ్లు. ఆ రోజు కూడా అదృశ్యవాణి నాతో మాట్లాడింది. ఇంట్లో వాళ్లంతా బయటికి పోగానే నా గదిలోకి వెళ్లి ప్రార్థన చేసేటప్పుడు వేసుకునే బురఖా ధరించా. అలా చెయ్యమని అదృశ్యవాణి చెప్పింది. తర్వాత న్యాస్తాను బల్లపై పడుకోబెట్టి గొంతునులిమి చంపేశా. కిచెన్‌ లో నుంచి కత్తి తీసుకొచ్చి పాప గొంతుకోసి, ఇంటికి నిప్పుపెట్టి బయటికొచ్చేశా' అని బబొకులోవా వెల్లడించినట్లు మాస్కో పోలీసు అధికారులు పేర్కొన్నారు.

'నేను ఉగ్రవాదిని.. దగ్గరికొచ్చే పేల్చేస్తా' బబొకులోవా మాస్కో మెట్రో రైల్ స్టేషన్ వద్ద చేసిన నినాదాలపైనా దృష్టిసారించిన పోలీసులు.. ఆమెకు టెర్రరిస్టు గ్రూపులతో ఎలాంటి సంబంధాలు లేవని తేల్చారు. అయితే భర్తను వదిలి మాస్కో వచ్చిన తర్వాత ఉబ్జెకిస్థాన్ కే చెందిన ఓ యువకుడితో బబొకులోవా ప్రణయం సాగించింది. కేవలం ఆమెను అవసరాలకు వాడుకున్నఆ ప్రియుడు కొద్దికాలంలోనే బొబోకులోవాను వదిలించుకున్నాడు. అటు భర్తను వదిలేయటం, ఇటు ప్రియుడు మోసం చేయడంతో ఆమె తీవ్ర మనోవేదనుకు గురై సైకోలా మారి ఉంటుందని మానసిక నిపుణులు అంటున్నారు. నలికడలేని జీవితంతో విసిగిపోనందునే హంతకురాలిగా మారి ఉంటుందనే అంచనాకు వచ్చారు. చార్జిషీటు పూర్తయిన పక్షంలో త్వరలోనే ఈ కేసు న్యాయస్థానానికి చేరుతుంది. సాక్ష్యాధారాల సేకరణ కోసం మంగళవారం నిదితురాలిని అపార్ట్ మెంట్ కు తీసుకొచ్చిన సందర్భంలో చుట్టుపక్కలవారు 'ఆమెను చంపేయండి' అంటూ బిగ్గరగా నినాదాలుచేశారు.
చిన్నారి తలతో రోడ్డుపై సంచరిస్తున్న బబోకులోవా (ఇన్ సెట్: నాలుగేళ్ల చిన్నారి న్యాస్తా)

మరిన్ని వార్తలు