బ్రిటన్‌ ప్రధాని రాజీనామా

25 May, 2019 02:47 IST|Sakshi
మీడియా సమావేశంలో భావోద్వేగానికి లోనైన థెరెసా మే

జూన్‌ 7న పదవి నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటన

బ్రెగ్జిట్‌ను ముందుకు తీసుకెళ్లలేకపోవడమే కారణం  

లండన్‌: కన్జర్వేటివ్‌ పార్టీ నాయకురాలి పదవికి తాను రాజీనామా చేస్తున్నట్లు బ్రిటన్‌ ప్రధాని థెరెసా మే శుక్రవారం ప్రకటించారు. జూన్‌ 7న తాను పదవి నుంచి వైదొలగుతాననీ, తమ కన్జర్వేటివ్‌ పార్టీ ఎంపీలు తదుపరి ప్రధానిని ఎన్నుకునే వరకు ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగుతానన్నారు. బ్రెగ్జిట్‌ ప్రక్రియకు సంబంధించి తమ సొంత పార్టీ ఎంపీల నుంచే తాను మద్దతు కూడగట్టలేకపోయాననీ, దేశ ప్రయోజనాల కోసం పదవి నుంచి తప్పుకోవాలని తాను నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. జూన్‌ 10 నుంచి కొత్త ప్రధానిని ఎన్నుకునే పని కన్జర్వేటివ్‌ పార్టీలో మొదలవుతుందని చెప్పారు.

బ్రెగ్జిట్‌ ఒప్పందం విషయంలో పలుమార్లు మేకి ఎదురుదెబ్బలు తగలడం తెలిసిందే. బ్రెగ్జిట్‌ తొలి దశ పూర్తయిన తర్వాత తాను ప్రధాని పదవి నుంచి తప్పుకుంటానని గతేడాది డిసెంబర్‌లోనే ఆమె తమ పార్టీ ఎంపీలకు హామీనిచ్చారు. అయితే బ్రెగ్జిట్‌ తొలిదశ పూర్తికాకముందే ఆమె ఇప్పుడు వైదొలగాల్సి వస్తోంది. ‘నా జీవితకాలంలో నాకు దక్కిన గొప్ప గౌరవం ఈ పదవి. త్వరలోనే పదవి నుంచి దిగిపోతున్నాను. నేను ప్రేమించే ఈ దేశానికి సేవ చేసే అవకాశాన్ని కల్పించినందుకు ఎంతో కృతజ్ఞత చూపుతూ పదవికి రాజీనామా చేస్తున్నాను తప్ప ఏ రకమైన దురుద్దేశంతో కాదు’ అని మే వెల్లడించారు.

తన రాజీనామా విషయాన్ని రాణి ఎలిజబెత్‌–2కి ఇప్పటికే తెలియజేశాననీ, జూన్‌ 3న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ బ్రిటన్‌ పర్యటనకు వచ్చినప్పుడు ఆ సమావేశాలకు తానే అధ్యక్షత వహిస్తానని మే తెలిపారు. ప్రతిపక్ష లేబర్‌ పార్టీ నాయకుడు జెరెమీ కార్బిన్‌ మాట్లాడుతూ మే ఇప్పటికి మంచి నిర్ణయం తీసుకున్నారనీ, ఆమెతోపాటు ఆమె పార్టీకి కూడా దేశాన్ని పాలించే బలం లేదని అన్నారు. కాగా, తదుపరి ప్రధాని రేసులో మాజీ విదేశాంగ మంత్రి బోరిస్‌ జాన్సన్‌ ముందంజలో ఉన్నారు. 

మరిన్ని వార్తలు