నిఘా గుట్టు చెప్పేశాడు!

17 May, 2017 02:08 IST|Sakshi
నిఘా గుట్టు చెప్పేశాడు!

మరో వివాదంలో ట్రంప్‌

ఏం జరిగింది:
మే 10.. రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్, అమెరికాలో రష్యా రాయబారి సెర్గీ కిస్లయాక్‌లతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వైట్‌హౌస్‌లో సమావేశమయ్యారు. ఐసిస్‌ నుంచి ఎదురవుతున్న సవా ళ్లపై చర్చించారు. పాశ్చాత్యదేశాల్లో దాడులకు ఐసిస్‌ కుట్రల గురించి చెబుతూ... మిత్రదేశం నిఘా వ్యవస్థల ద్వారా అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రతిరోజూ తనకందుతుందని చెప్పుకొచ్చారు. ల్యాప్‌ట్యాప్‌ల ద్వారా విమానాల పేల్చివేతకు ఐసిస్‌ సిరియాలోని ఏ పట్టణంలో వ్యూహరచన చేసిం దో ఆ వివరాలను రష్యా ప్రతినిధులకు తెలి పారు.వాటితోపాటు అంతకుమించి రహస్య సమాచారాన్ని ట్రంప్‌ బయటపెట్టారని, అమెరికా ప్రయోజనాల దృష్ట్యా దాన్ని వెల్లడించలేమని వాషింగ్టన్‌ పోస్ట్‌ పత్రిక వెల్లడించింది.ఈ ఆరోపణల్ని మాత్రం వైట్‌హౌస్‌ ఖండిం చింది. సమాచారం ఎలా, ఎవరి నుంచి అందుతుందనే వివరాల్ని ట్రం ప్‌ చెప్పలేదని జాతీయ భద్రతా సలహాదా రు మెక్‌మాస్టర్‌ చెప్పినా ట్రంప్‌ విశ్వసనీయతపై మాత్రం సందేహాలు మొదలయ్యాయి.

 అత్యంత రహస్య సమాచారం లీక్‌
ట్రంప్‌ వెల్లడించిన సమాచారం మిత్రదేశం అమెరికాతో పంచుకున్న అత్యంత రహస్య నిఘా సమాచారమని వాషింగ్టన్‌ పోస్టు పేర్కొంది. అమెరికా అధికార వ్యవస్థలో పైస్థాయిలో అతికొద్ది మందికి మాత్రమే అది తెలుసు. సమాచారం ఇస్తున్న వారి గోప్యతను కాపాడే ఉద్దేశంతో... పలు మిత్రదేశాలకు కూడా ఈ సమాచారాన్ని వెల్లడించలేదు. ఇప్పుడది రష్యాకు ట్రంప్‌ చెప్పారన్న వార్తలతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సమాచారం ఇస్తున్న వారి గోప్యత కాపాడటంలో అమెరికా సమర్థతపై సందేహాలు నెలకొనే ప్రమాదముందని విశ్లేషకులు చెబుతున్నారు. అలాగే ఐసిస్‌పై గుట్టుమట్లు తెలిసిన వర్గాల నుంచి వస్తున్న రహస్య సమాచారం ఆగిపోవచ్చని, గూఢచారులను కనిపెట్టేందుకు ఐసిస్‌ వేట మొదలుపెడితే ప్రాణనష్టం తప్పదంటున్నారు.

భవిష్యత్తులో జరిగే దాడులను పసిగట్టడంలో అమెరికా, దాని మిత్రదేశాల అవకాశాలను దెబ్బతీయొచ్చని, అధ్యక్షుడిగా పనిచేస్తున్న వ్యక్తి అత్యంత రహస్య సమాచారాన్ని కాపాడకపోతే ప్రపంచ దేశాల్లో అమెరికా చులకన కావచ్చనే అభిప్రాయాలున్నాయి. ఏదైనా సమాచారాన్ని ఒక దేశం ఇస్తున్నపు డు దాని అనుమతి లేకుండా.. సదరు సమాచారాన్ని ఇతరులతో పంచుకోకూడదు. గో ప్యత కొరవడితే సీఐఏ, ఎన్‌ఎస్‌ఏల్లోని అధి కారుల స్థైర్యం దెబ్బతినే ప్రమాదముంది.  

 రష్యా జోక్యంపై ఆందోళన
హిల్లరీ క్లింటన్, ఇతర డెమొక్రటిక్‌ పార్టీ కీలక సభ్యుల ఈమెయిల్స్‌ను లీక్‌ చేయడం ద్వారా అమెరికా అధ్యక్ష ఎన్నికలను రష్యా ప్రభావితం చేసిందనేది ఆరోపణలున్నాయి. దీంట్లో రష్యా రాయబారి సెర్గీ క్లిసయాక్‌ పేరు కూడా వినపడింది. ఈ ఆరోపణలపై విచారణ జరుపుతున్న ఎఫ్‌బీఐ డైరెక్టర్‌ జేమ్స్‌ కోమీని ట్రంప్‌ 9న ఆకస్మికంగా పదవి నుంచి తప్పించారు. మరుసటి రోజు రష్యా ప్రతినిధులతో రహస్య సమాచారాన్ని ట్రంప్‌ చెప్పేశారు. చిరకాల ప్రత్యర్థి అయిన రష్యాకు ట్రంప్‌ అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు మొదటినుంచీ ఉన్నా యి. రష్యాతో ట్రంప్‌ సంబంధాలపై విచారణ జరగాలనే డిమాండ్లు వస్తున్నాయి.

 రష్యాకు చెప్పా..
అధ్యక్షుడిగా నేను కొన్ని విషయాలను రష్యాతో పంచుకున్నాను... తీవ్రవాదం, విమాన ప్రయాణికుల భద్రతకు సంబంధించిన కొన్ని వాస్తవాలను చెప్పాను. అలా చెప్పే సంపూర్ణ అధికారం నాకుంది. మానవతాదృక్పథంతో చేశా. పైగా ఐసిస్‌పై, తీవ్రవాదంపై రష్యా తమ పోరును తీవ్రతరం చేయాలని నేను కోరుకుంటున్నాను.
– సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

మరిన్ని వార్తలు