టర్కీ దళాల చేతిలో ఐఎస్‌ చీఫ్‌ బాగ్ధాది సోదరి..

5 Nov, 2019 09:07 IST|Sakshi

న్యూఢిల్లీ : అమెరికా సేనల ఆపరేషన్‌లో హతమైన ఐఎస్‌ చీఫ్‌ అల్‌ బాగ్ధాది సోదరి సిరియాలో టర్కీ దళాలకు చిక్కినట్టు టర్కీ అధికారి వెల్లడించారు. బాగ్ధాది సోదరి, 65 సంవత్సరాల రస్మియా అవద్‌కు ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధం ఉందని భావిస్తున్నారు. అలెప్పో ప్రావిన్స్‌లోని అజాజ్‌ పట్టణంలోని ఓ  కుటుంబంతో కలిసి నివసిస్తున్న కంటెయినర్‌పై దాడి జరిపిన క్రమంలో రస్మియా అవద్‌ను టర్కీ దళాలు నిర్బంధంలోకి తీసుకున్నాయి. బాగ్ధాది సోదరి రస్మియాతో ఆమె భర్త, కోడలు, ఐదుగురు పిల్లలు ఉన్నారని, కుటుంబ సభ్యులను ఇంటారాగేట్‌ చేస్తున్నామని టర్కీ అధికారి వెల్లడించారు. ఉగ్రవాదులను ఏరివేసే క్రమంలో అలెప్పో ప్రాంతాన్ని టర్కీ​ దళాలు తమ అదుపులోకి తీసుకుని జల్లెడ పడుతున్నాయి. రస్మియా చిక్కడంతో ఐఎస్‌ కార్యకలాపాలపై లోతైన సమాచారంతో ఐఎస్‌ ఉగ్ర మూకలను పట్టుకునే అవకాశం లభిస్తుందని టర్కీ అధికార వర్గాలు పేర్కొన్నాయి. అల్‌ బాగ్ధాదిని గత నెల అమెరికన్‌ దళాలు మట్టుబెట్టిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు