282 చేరిన మృతుల సంఖ్య : టర్కీ బొగ్గు గని విషాదం

16 May, 2014 03:04 IST|Sakshi
282 చేరిన మృతుల సంఖ్య : టర్కీ బొగ్గు గని విషాదం

 సోమా (టర్కీ): పశ్చిమ టర్కీలోని బొగ్గు గనిలో సంభవించిన పేలుడులో మృతుల సంఖ్య 282కు పెరిగింది. ఇంకా చాలా మంది గనిలోనే చిక్కుకునిపోయి ఉన్నారు. వారి పరిస్థితి తెలియరాకుండా ఉంది. గని ఆపరేటర్ల అంచనా ప్రకారం 90 మంది ఇంకా లోపల ఉన్నారు. అయితే సహాయక సిబ్బంది ప్రకారం ఆ సంఖ్య చాలా ఎక్కువగా ఉండవచ్చని తెలుస్తోంది. గనుల యజమానుల నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా దేశంలోని నాలుగు పెద్ద యూనియన్లు గురువారం దేశ వ్యాప్తంగా సమ్మె చేశాయి. అధిక లాభాల కోసం యజమానులు తమ ప్రాణాలు పణంగా పెడుతున్నారని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమతో యజమానులు బలవంతంగా పని చేయిస్తున్నారని కార్మికులు ఆరోపించారు.

మంగళవారం సోమా పట్టణంలోని గనిలో సంభవించిన ప్రమాదానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. గనిలో పేలుడుపై ప్రభుత్వం విచారణ ప్రారంభించింది. అయితే ఆ దుర్ఘటనలో ప్రభుత్వ నిరక్ష్యం లేదని ప్రధాని రెసిప్ తయిప్ ఎర్డగాన్ చెప్పారు. ఇలాంటి ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయని ఆయన సమర్థించుకున్నారు. బ్రిటన్‌లో 1862లో 204 మంది, 1864లో 361 మంది గని ప్రమాదాల్లో మృతి చెందిన సంఘటనలు ఆయన గుర్తు చేశారు. గని సందర్శన సమయంలో బాధితులు బంధువుల నిరసనతో ప్రధాని ఎర్డగాన్ ఒక షాపులో తలదాచుకోవాల్సి వచ్చింది. కొంత మంది ఆయన కారుపై దాడి చేశారు. బుధవారం ఉదయం గని ప్రమాదంలో 245 చనిపోయారని ప్రధాని ప్రకటించిన విషయం తెలిసిందే. 

మరిన్ని వార్తలు