వైరలవుతోన్న బ్రిటీష్‌ సిక్కు విద్యార్థిని వీడియో

10 Aug, 2019 18:02 IST|Sakshi

లండన్‌: మన దేశంలో కులం, మతం, ప్రాంతం పేరుతో తన్నుకు చస్తూంటే.. విదేశాల్లో జాత్యాంహకార దాడులు జరుగుతుంటాయి. రంగు, దేశం పేరుతో విదేశాల్లో ఉన్న భారతీయులు వేధింపులకు గురవుతుంటారు. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి బ్రిటన్‌లో చోటు చేసుకుంది. పదేళ్ల బ్రిటీష్‌ సిక్కు విద్యార్థిని జాత్యాంహకార దూషణలు ఎదుర్కొంది. అయితే చాలా మంది లాగా ఆ చిన్నారి బాధపడుతూ కూర్చోలేదు. తనను కామెంట్‌ చేసినవారినే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి వ్యాఖ్యలు చేసేవారి నోరు మూతపడేలా.. స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చింది. ఈ మేరకు ఓ వీడియోను ట్విట్‌ చేసింది. బ్రిటీష్‌ సిక్కు విద్యార్థిని పదేళ్ల మున్సిమర్‌ కౌర్‌ కొద్ది రోజుల క్రితం అమ్యూజ్‌మెంట్‌ పార్కులో తనకు ఎదురైన చేదు అనుభవాల గురించి వీడియోలో చెప్పుకొచ్చింది.

‘కొద్ది రోజుల క్రితం నేను ఓ అమ్యూజ్‌మెంట్‌ పార్క్‌కు వెళ్లాను. నా ఫేవరెట్‌ గేమ్‌ ఆడదామని వెళ్లి చూస్తే.. అక్కడ చాలా మంది జనాలున్నారు. అప్పుడు అక్కడే ఉన్న 14-17 ఏళ్ల వయసున్న కొందరు అమ్మాయిలు, అబ్బాయిల దగ్గరకు వెళ్లి.. నేను ఈ గేమ్‌ ఆడతా అని చెప్పా. అప్పుడు వారు పెద్దగా నవ్వుతూ.. నువ్వు ఆడకూడదు.. నువ్వు ఉగ్రవాదివి అంటూ నన్ను కామెంట్‌ చేశారు. ఆ మాటలు నన్ను చాలా బాధపెట్టాయి. కానీ దాన్ని బయట పడనీయకుండా.. తలెత్తుకుని అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చేశాను’ అంటూ చెప్పుకొచ్చింది.
 

‘మరుసటి రోజు కూడా అదే పార్క్‌కు వెళ్లాను. అక్కడ నేను నా వయసు పాపతో ఆడుకుంటున్నాను. కాసేపటి తర్వాత ఆ పాప వాళ్ల అమ్మ తనను పిలిచి.. నాతో ఆడకూడదని.. నేను చాలా ప్రమాదకర వ్యక్తినని చెప్పింది. కానీ ఆ పాప వాళ్ల అమ్మ మాటల్ని కొట్టి పారేస్తూ.. తల్లి తరఫున తను నాకు క్షమాపణలు చెప్పింది. ఈ రెండు సంఘటనలు చూశాక జనాల అమాయకత్వం చూసి నాకు జాలేసింది. వీరికి సిక్కుల గురించి అసలు ఏమి తెలియదు. మేము ప్రతి ఒక్కరిని ప్రేమిస్తాం.. చాలా జాగ్రత్తగా చూసుకుంటాం. మీకు ఈ విషయాల గురించి తెలియక మమ్మల్ని కించపరుస్తూ మాట్లాడుతున్నారు’ అని మున్సిమర్‌ ఆవేదన వ్యక్తం చేసింది.

అంతేకాక ‘అయితే ఒక్క విషయం గమనించండి.. అందరూ ధైర్యవంతులే ఉండరు. మీ మాటలు విన్న తర్వాత కూడా ధైర్యంగా ముందుకు సాగిపోవడం.. లేదా వారి తల్లిదండ్రులతో ఈ విషయాల గురించి చర్చించడం వంటి పనులు అందరూ చేయలేరు. దయచేసి మనుషుల్ని ఇలా బాధపెట్టకండి. అలానే ఇలాంటి విమర్శలు ఎదురైనప్పుడు ధైర్యంగా తలెత్తుకు ముందుకు సాగండి.. ఏదో రోజు వారే అర్ధం చేసుకుంటారు’ అంటూ వీడియోలో చెప్పుకొచ్చింది. మున్సిమర్‌ కౌర్‌ తండ్రి ట్విటర్‌లో షేర్‌ చేసిన ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. చిన్న దానివి ఐనా చాలా గొప్పగా చెప్పావ్‌.. నీ మాటలు ఎందరికో స్ఫూర్తినిస్తాయి అంటూ నెటిజన్లు అభినందిస్తున్నారు.

మరిన్ని వార్తలు