అమానుషం; షమీమా కొడుకు చనిపోయాడు..!

9 Mar, 2019 16:26 IST|Sakshi

డమాస్కస్‌ : ఇస్లామిక్‌ స్టేట్‌(ఐఎస్‌)లో చేరి ప్రస్తుతం సిరియన్‌ డెమొక్రటిక్‌ ఫోర్సెస్‌(ఎస్‌డీఎఫ్‌) రెఫ్యూజీ క్యాంపులో ఆశ్రయం పొందుతున్న బ్రిటన్‌ పౌరురాలు షమీమా బేగం కొడుకు మరణించాడని ఎస్‌డీఎఫ్‌ ప్రతినిధి తెలిపారు. నిమోనియా కారణంగా అతడు మృతిచెందినట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆమె పౌరసత్వాన్ని రద్దు చేసి అమానుషంగా ప్రవర్తించారంటూ బ్రిటన్‌ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. 2015లో సిరియాకు పారిపోయి ఐఎస్‌లో చేరిన బంగ్లాదేశీ- బ్రిటీష్‌ టీనేజర్‌ షమీమా బేగం(19).. అక్కడే తన సహచరుడి(డచ్‌ పౌరుడు)ని పెళ్లి చేసుకుంది. ఐఎస్‌ ఉగ్రవాదులు ఏరివేతలో భాగంగా షమీమా భర్తను ఎస్‌డీఎఫ్‌ దళాలు అదుపులోకి తీసుకోవడంతో గర్భవతి అయిన తనను స్వదేశానికి తీసుకువెళ్లాలని.. బ్రిటన్‌ ప్రభుత్వాన్ని కోరింది. అయితే షమీమా వల్ల పౌరుల భద్రతకు ప్రమాదం వాటిల్లే ప్రమాదం ఉన్నందని పేర్కొంటూ షమీమా పౌరసత్వాన్ని బ్రిటన్‌ ప్రభుత్వం రద్దు చేసింది.(చదవండి : పిక్‌నిక్‌కు వెళ్తున్నామని చెప్పి.. ప్రస్తుతం గర్భిణిగా!)

ఈ నేపథ్యంలో తనతో పాటు షమీమాను కూడా నెదర్లాండ్‌కు తీసుకువెళ్లాలని ఆమె భర్త భావించాడు. అయితే అక్కడి చట్టాల ప్రకారం మైనర్‌ను పెళ్లి చేసుకుంటే వారి వివాహం చెల్లదనే అభిప్రాయాలు వ్యక్తమవడంతో షమీమా సిరియాలోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఇటీవలే ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. అతడికి జరా అని నామకరణం చేసింది. అయితే పౌష్టికాహారం లోపం వల్ల బలహీనంగా పుట్టిన అతడు ప్రస్తుతం నిమోనియాతో మరణించడంతో బ్రిటన్‌ తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ‘అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఒక వ్యక్తికి ఆశ్రయం లేకుండా చేయడం నేరం. ఆమె పౌరసత్వాన్ని రద్దు చేయడం ద్వారా చిన్నారి చావుకు కారణమయ్యారు. ఇది చాలా అమానుష చర్య’ అని బ్రిటన్‌ ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.(షమీమా సంచలన వ్యాఖ్యలు)

ఈ విషయాలపై స్పందించిన బ్రిటన్‌ హోం శాఖ కార్యదర్శి జావీద్‌ మాట్లాడుతూ.. ‘ఇది నిజంగా విచారకరం. అయితే అక్కడి క్యాంపుల్లో చాలా మంది ఆశ్రయం పొందుతున్నారు. చనిపోయింది షమీమా కొడుకో కాదో తేలాల్సి ఉంది. ఉగ్రవాదం కారణంగా యుద్ధ జోన్లలో ఉన్న వారి పరిస్థితి ఇలాగే ఉంటుంది. ఆ పిల్లాడి మరణాన్ని కూడా రాజకీయం చేయడం సరికాదు’ అని హితవు పలికారు. కాగా కొన్ని రోజుల క్రితం.. షమీమా పౌరసత్వాన్ని రద్దు చేస్తామని ప్రకటించిన జావీద్‌.. ఆమెకు పుట్టబోయే బిడ్డ ఏనాటికీ బ్రిటీష్‌ పౌరుడు కాలేదని వ్యాఖ్యానించారు.(చదవండి : ఇంటికి వెళ్లాలని ఉంది)

ఇక తమదేశంలో ఉన్న విదేశీ జీహాదీలను క్యాంపుల నుంచి తిరిగి తమ తమ దేశాలకు తీసుకువెళ్లాలంటూ ఎస్‌డీఎఫ్‌ పశ్చిమ దేశాలకు విజ్ఞప్తి చేస్తోన్నసంగతి తెలిసిందే. అయితే ఐసిస్‌ సానుభూతి పరులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు బ్రిటన్‌ ప్రభుత్వం నిరాకరిస్తోంది. ఎస్‌డీఎఫ్‌ విఙ్ఞప్తిని మన్నించలేమని, గుర్తింపు పొందిన ఏదైనా ప్రభుత్వంలో ఈ విదేశీ జీహాదీలు భాగమైనపుడు మాత్రమే సహాయం చేసే అవకాశం ఉంటుందని పేర్కొంది. అదే విధంగా అమెరికా కూడా విదేశీ జీహాదీలను స్వదేశానికి తీసుకువచ్చినా సరే.. వారికి సరైన శిక్ష విధించాలనే దృఢచిత్తంతో ఉంది. అందుకే వివిధ దేశాలను ఇందుకు సంబంధించిన చట్టపరమైన అంశాలను సమీక్షించాల్సిందిగా ఒత్తిడి చేస్తోంది. ఈ క్రమంలో షమీమా వంటి సిరియా రెఫ్యూజీల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది.

మరిన్ని వార్తలు