మసూద్‌ అజహర్‌ను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టండి : అమెరికా

28 Mar, 2019 09:56 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : పాకిస్తాన్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్ర సంస్థ జైషే మహ్మద్‌ చీఫ్‌ మసూద్‌ అజహర్‌ను ఐక్యరాజ్యసమితి(ఐరాస) అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించే విషయంపై  అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్‌ దేశాలు మరో అడుగు ముందుకేశాయి. ఐక్యరాజ్యసమితి భద్రత మండ‌లిలో చైనాపై ఒత్తిడి తెచ్చేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. రెండు వారాల క్రిత‌మే అమెరికా ప్రతిపాద‌న‌ను త‌న వీటో అధికారంతో చైనా అడ్డుకున్న విష‌యం తెలిసిందే. అయితే తాజాగా మ‌ళ్లీ బ్రిట‌న్‌, ఫ్రాన్స్ దేశాల స‌హ‌కారంతో అమెరికా.. ఐక్యరాజ్య స‌మితిలో అజ‌ర్ నిషేధంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. భ‌ద్రతా మండ‌లిలో ఉన్న 15 స‌భ్యదేశాలకు బ్రిట‌న్‌, ఫ్రాన్స్ సంత‌కం చేసిన తీర్మానాన్ని అమెరికా స‌ర్క్యూలేట్ చేసింది. అజ‌ర్‌పై ట్రావెల్ బ్యాన్ విధించాల‌ని, అత‌ని ఆస్తుల‌ను స్తంభింప‌చేయాల‌ని కోరింది.
మళ్లీ చైనా అడ్డుపుల్ల
ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఆంక్షల కమిటీ ప్రకారం మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలని ఫ్రాన్స్, యూకే, అమెరికాలు ఫిబ్రవరి 27న ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ఈ ప్రతిపాదనపై కారణాలను సాకుగా చూపుతూ భద్రతామండలిలో మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించకుండా చైనా నాలుగోసారి అడ్డుకుంది. దీంతో ఈ సారి కచ్చితంగా అజహర్‌ను నిషేదించేలా అమెరికా గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఇటీవ‌ల జ‌రిగిన పుల్వామాలో దాడిలో త‌మ పాత్ర ఉనట్లు జైషే అంగీక‌రించిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఆ ఉగ్రవాదిపై నిషేధం విధించేందుకు అగ్ర రాజ్యం అమెరికా తీవ్ర ప్రయ‌త్నాలు చేస్తోంది.

మరిన్ని వార్తలు