భారత్‌పై చైనా దుందుడుకు వైఖరి

23 May, 2020 04:57 IST|Sakshi

డ్రాగన్‌ దేశంపై ఉమ్మడిగా పోరాడాలన్న అమెరికా

వాషింగ్టన్‌: భారత్‌ సహా సరిహద్దు దేశాలపై చైనా కవ్వింపు చర్యలకు దిగుతోందని అమెరికా తీవ్రంగా విమర్శించింది. బలవంతంగా సైనిక చర్యలు చేపడుతూ మిలటరీని మోహరిస్తూ దురుసుగా ప్రవర్తిస్తోందని గురువారం అధ్యక్షభవనం విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. ఎల్లో సీ, తూర్పు, దక్షిణ చైనా సముద్రాలు, తైవాన్‌ జలసంధి, భారత్‌ చైనా సరిహద్దుల్లో చైనా చేస్తున్న పనులకు, చెబుతున్న మాటలకి పొంతన లేదని ఆ నివేదికలో అగ్రరాజ్యం ధ్వజమెత్తింది. ‘చైనా పట్ల అమెరికా వ్యూహాత్మక ధోరణి’పేరుతో రచిం చిన ఈ నివేదికను అమెరికా ప్రభుత్వం కాంగ్రెస్‌కు సమర్పించింది.

చైనాను ఎదుర్కోవడానికి వివిధ దేశాలు, సంస్థలతో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని ఆ నివేదిక అభిప్రాయపడింది. బలమైన శక్తిగా అవతరిస్తోన్న చైనా తమ ప్రయోజనాలకు విరుద్ధంగా ప్రవర్తించిన వారిని గుప్పిట్లోకి తీసుకోవాలని చూస్తోందని మండిపడింది. చైనా కమ్యూనిస్టు పార్టీ పొరుగు దేశాలపై దురుసుగా ప్రవర్తిస్తోందని విమర్శించింది. నేషనల్‌ సైబర్‌ సెక్యూరిటీ చట్టాన్ని తీసుకువచ్చి ప్రపంచ దేశాల సమాచారాన్ని తన గుప్పిట్లో పెట్టుకోవాలని చైనా చూస్తోందని, ఈ చట్టం ద్వారా అందరి డేటాని తస్కరించే పనిలో ఉందని పేర్కొంది. ఇటీవలి కాలంలో భారత్, చైనా సరిహద్దుల్లో సైనికుల మధ్య ఘర్షణలు చెలరేగిన నేపథ్యంలో అధ్యక్షభ వనం ఈ నివేదికను కాంగ్రెస్‌కి సమర్పించడం గమనార్హం.

భారత్‌తో చర్చలు జరపాలి  
దక్షిణ చైనా సముద్రంలో చైనా చేపడుతున్న ఆపరేషన్లకు అదుపులేకుండా పోయిందని దక్షిణ, మధ్య ఆసియా వ్యవహారాల శాఖ సహాయ మంత్రి పదవి నుంచి వైదొలగనున్న అలీస్‌ వెల్స్‌ అన్నారు. సరిహద్దు దేశాలపై కవ్వింపు చర్యల కు దిగుతూ య« దాతథ స్థితిని, సరిహద్దుల్ని మార్చడానికి చైనా ప్రయత్నిస్తోందని ఆమె మండిపడ్డారు. చైనా ఇప్పటికైనా ఇలాంటి చర్యల్ని కట్టిపెట్టిæ భారత్‌తో చర్చలు జరపాలని అన్నారు. చైనా భారత్‌తో చర్చలు జరిపి సానుకూల వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవాలన్నారు.
మిషిగాన్‌లో కరోనా ఫేస్‌ షీల్డ్‌ ధరించిన ట్రంప్‌   

మరిన్ని వార్తలు