మళ్లీ ముదిరింది : చైనాపై అమెరికా పంజా

18 Sep, 2018 09:21 IST|Sakshi

వాషింగ్టన్‌ : అమెరికా, చైనాల మధ్య వాణిజ్య యుద్ధం మళ్లీ ముదిరింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ఈసారి చైనాకు అతిపెద్ద పంచ్‌ ఇచ్చారు. అదనంగా 200 బిలియన్‌ డాలర్ల చైనీస్‌ దిగుమతులపై టారిఫ్‌లను విధించనున్నట్టు వెల్లడించారు. దీనిలో వినియోగదారులకు చెందిన ప్రముఖ ఉత్పత్తులు ఉన్నాయి. దీంతో వినియోగదారులు బీజింగ్‌ నుంచి పొందే ట్రేడ్‌ మినహాయింపులు పోయి, ఆ ప్రొడక్ట్‌లకు ఎక్కువ చెల్లించాల్సి వస్తోంది. ఇది అమెరికా వినియోగదారులకే అతిపెద్ద షాక్‌ గా ఉంది.

చైనీస్‌ సంస్థల నుంచి అమెరికన్లను కొనుగోలు చేసే 505 బిలియన్‌ ఉత్పత్తుల్లో సగానికి పైగా ఉత్పత్తులు కొత్త టారిఫ్‌ లెవీలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ట్రంప్‌ సోమవారం ప్రకటించారు. జూలైలో మొదటిసారి ట్రంప్‌ టారిఫ్‌ వార్‌కు తెరతీసిన సంగతి తెలిసిందే. అప్పుడు 50 బిలియన్‌ డాలర్ల ఇండస్ట్రియల్‌ గూడ్స్‌పై టారిఫ్‌లు విధించారు. తొలి వాణిజ్య యుద్ధం మాదిరిగా కాకుండా... సోమవారం ప్రకటించిన ఉత్పత్తుల్లో ఎక్కువగా వినియోగదారుల ఉత్పత్తులు ఎయిర్‌ కండీషనర్లు, స్పార్క్‌ ప్లగ్స్‌, ఫర్నీచర్‌, ల్యాంప్స్‌ వంటివి ఉన్నాయి. దీంతో ట్రంప్‌ విధించిన టారిఫ్‌లతో అమెరికన్‌ వినియోగదారులే ఎక్కువగా నష్టపోనున్నట్టు కనిపిస్తోంది. సెప్టెంబర్‌ 24 నుంచి ప్రభావిత వస్తువులకు అమెరికా దిగుమతిదారులు అదనంగా 10 శాతం టారిఫ్‌లను చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఏడాది చివరి కల్లా ఈ టారిఫ్‌లు 25 శాతానికి పెరుగుతాయని సీనియర్‌ అడ్మినిస్ట్రేషన్‌ అధికారులు చెప్పారు. 

అమెరికా ఆర్థిక వ్యవస్థ దీర్ఘకాల సంపదకు చైనా ఓ భయంకరమైన ముప్పుగా ఉందని ట్రంప్‌ అన్నారు. చైనా అన్యాయమైన వాణిజ్య పద్ధతుల మార్పు కోసం ఈ టారిఫ్‌లను విధించినట్టు ట్రంప్‌ చెప్పారు. గత కొన్ని నెలలుగా ఈ అన్యాయపూర్వకమైన పద్ధతులపై యుద్ధం చేస్తున్నామని, చైనాకు తాము ప్రతి అవకాశం కల్పిస్తున్నామని, కానీ చైనా మాత్రం తన విధానాలను మార్చుకోవడం లేదని అన్నారు. అమెరికా విధించిన ఈ టారిఫ్‌లతో చైనా కొత్త వాణిజ్య చర్చలను తిరస్కరించింది. అమెరికా తీసుకున్న ఈ చర్యకు, ప్రతీకారం తీసుకోనున్నట్టు ప్రకటించింది. అయితే వాణిజ్య సమస్యల విషయంలో చైనాతో చర్చించేందుకు తాము సన్నద్ధతోనే ఉన్నామంటూ వైట్‌ హౌజ్‌ నేషనల్‌ ఎకానమిక్‌ కౌన్సిల్‌ డైరెక్టర్‌ ల్యారీ కుడ్లో చెప్పారు. ఈ అదనపు టారిఫ్‌లను వందల కొద్దీ అమెరికా కంపెనీలూ వ్యతిరేకించాయి. ఈ టారిఫ్‌ల వల్ల ఉత్పత్తుల ధరలు భారీగా పెరుగుతాయని, విక్రయాలు కూడా ఖరీదైనవిగా మారతాయని ఆరోపించాయి. తొలిసారి టారిఫ్‌లను విధించిన సమయంలోనే 6వేలకు పైగా రాతపూర్వక ఫిర్యాదు వచ్చాయి. అయినప్పటికీ, మళ్లీ మళ్లీ చైనాపై అమెరికా పంజా విసురుతూనే ఉంది. ఆ రెండు దేశాలు ట్రేడ్‌ వార్‌ను ముగించకుండా... యుద్ధం చేసుకుంటూనే ఉన్నాయి. 
 

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు