చెట్ల కొమ్మలతో.. ఊహా లోకానికి ‘దారి’!!

30 May, 2020 16:21 IST|Sakshi

కరోనా లాక్‌డౌన్‌ సమస్త మానవాళికి కొత్త ‘రోజు’లను పరిచయం చేసిందనడంలో సందేహం లేదు. ఉరుకులు పరుగుల జీవితం బిజీగా ఉండే సగటు మనిషి.. లాక్‌డౌన్‌తో ఇళ్లల్లోనే బందీ అయ్యాడు. ఈక్రమంలో ఎవరికి వారు లాక్‌డౌన్‌ సమయాన్ని వినియోగించుకుంటున్నారు. ఎప్పుడూ లేని కొత్త అలవాట్లను అవవర్చుకుంటున్నారు. తాజాగా ఓ పెద్దాయన చేసిన వినూత్న ఆలోచన ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అతని చక్కని కళాకృతిపై ప్రశంసలు కురుస్తున్నాయి. 

ఆధ్యాత్మిక భావాలు గల డేవిడ్‌ అనే వ్యక్తి అందుబాటులో ఉన్న వనరులతో ‘ఊహాలోకంలోకి ప్రవేశ మార్గం’ తయారు చేసుకున్నాడు. తన బంధువు కింబర్లీ ఆడమ్స్‌ ద్వారా ఈ విషయం బయటి ప్రపంచానికి తెలిసింది. తనకూ తన బంధువు డేవిడ్‌కు మధ్య జరిగిన సంభాషణ, ఆయన షేర్‌ చేసిన ఫొటోలను ఆమె ట్విటర్‌లో పంచుకోవడంతో వైరల్ అయింది. ‘లాక్‌డౌన్‌ సమయంలో ఏం చేస్తున్నారు’అని అతను ఆడమ్స్‌ను ప్రశ్నించగా.. పియానో నేర్చుకుంటున్నాను అని ఆమె బదులిచ్చింది. ‘మీరేం చేస్తున్నారు’అని ఆమె ప్రశ్నించగా.. ‘ఊహా లోకంలోకి ప్రవేశమార్గం నిర్మించాను. అది నా వెనకాలే ఉంది. చూడు’ అని ఆ పెద్దాయన సమాధానం ఇచ్చాడు. దానికి సంబంధించిన నాలుగు ఫొటోలు షేర్‌ చేశాడు. ఇక ఆడమ్స్‌ ట్వీట్‌ను 25 వేల మంది రీట్వీట్‌ చేయగా.. లక్షన్నర మంది లైక్‌ చేశారు. చెట్ల కొమ్మలు, అందుబాటులో ఉన్న వస్తువులతో అద్భుతమైన కళాకృతి తయారు చేశారని పలువురు కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు