ఆమె తెల్లగా ఉందని టిప్ ఇవ్వనన్నాడు!

2 May, 2016 11:46 IST|Sakshi
ఆమె తెల్లగా ఉందని టిప్ ఇవ్వనన్నాడు!

రెస్టారెంట్లో వెయిటర్కు టిప్ ఇవ్వకపోతే అతనేం చేస్తాడు? మనసులో ఎంత కోపం ఉన్నా పైకి నవ్వుతూ తల ఊపుతాడు. వెయిట్రస్ అయిన ఆమెకు ఓ కస్టమర్ టిప్పు ఇవ్వకపోగా తీవ్రంగా అవమానించిన ఘటనలో చలించిపోయిన స్నేహితులు, నెటిజన్లు ఆమెకు రూ.2.07లక్షల భారీగా విరాళాన్ని పంపారు.. టిప్పుగా!

ఆష్లే స్కుల్జ్ అనే 24 ఏళ్ల శ్వేతజాతి యువతి కేప్ టౌన్ లోని ఓజ్ కేఫ్ లో వెయిట్రస్ గా పనిచేస్తోంది. తల్లి కేన్సర్ బారిన పడటంతో చదువుకుంటూనే ఉద్యోగం చేస్తోంది. గతవారం ఆమె పనిచేస్తోన్న కేఫ్ కు ఎన్టొకోజో క్వాంబే అనే విద్యార్థినాయకుడు వెళ్లాడు. తినడం పూర్తియిన తర్వాత టిప్ అడిగిన ఆష్టేకు చేతిలో చిన్న పేపర్ ముక్క పెట్టాడు క్వాంబే. అందులో రాసున్నదిచూసి టపటపా కన్నీళ్లు కార్చిందామె. 'మొసలిలా ఏడుస్తావెందుకు?' అని అవమానించడమేకాక 'ఇలా జరిగిందంటూ' ఆష్లేతో జరిగిన సంవాదాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడా విద్యార్థి నేత. అంతే.క్వాంబేపై నెటిజన్లు విరుచుకుపడ్డారు. అనవసరంగా వెయిట్రస్ ను అవమానించాంటూ అతణ్ని తిట్టిపోశారు. 'వాడు ఇవ్వకపోతే పోయాడు.. టిప్పు మేమిస్తున్నాం తీస్కో..' అంటూ ఏకంగా 44వేల రాండ్లు (మన కరెన్సీలో దాదాపు రూ.2.07 లక్షలు) డొనేట్ చేశారు. ఇంతకీ ఆ పేపర్ లో అతనేం రాశాడంటే..

'మా నేలను విడిచి వెళ్లిపోతానని చెప్పు. అప్పుడే టిప్ ఇస్తా'అని క్వాంబే.. వెయిట్రస్ ఆష్లేకు ఇచ్చిన లెటర్ లో రాశాడు. ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీలో పీజీ పూర్తిచేసిన అతను ఇప్పుడు సౌతాఫ్రికాలో భారీ ఉద్యమాన్ని నడుపుతున్నాడు. కేప్ టౌన్ వర్సిటీలో ఏర్పాటుచేసిన మాజీ ప్రధాని సిసిల్ జాన్ రోడ్స్ విగ్రహాన్ని తొలిగించాలనే ఉద్యమానికి క్వాంబే నాయకుడు. తెల్లవాళ్లను ఈసడించుకునే క్వాంబే.. వీలుచిక్కినప్పుడల్లా ఇలా తెల్లతోలు వ్యక్తులపై మాటలతో విరుచుకుపడతాడు. దీంతో అతనిపై 'జాత్యహంకారి' అనే ముద్రపడింది. గతవారం కేఫ్ లో చోటుచేసుకున్న సంఘటనతో అతనిపై మరోసారి విమర్శలు వెల్లువెత్తాయి. సౌతాఫ్రికా గడ్డపై తెల్లవాళ్ల పెత్తనం చెల్లబోదంటూ నల్లజాతీయులు చేస్తోన్న ఉద్యమం ఇటీవల తారాస్థాయికి చేరింది. సౌతాఫ్రికన్ క్రికెట్ జట్టులోనూ తెల్ల ఆటగాళ్ల సంఖ్యపై నల్లజాతీయులు నిరసనలు తెలుపుతున్నారు.

మరిన్ని వార్తలు