ఎందుకు ఓడారంటే

10 Nov, 2016 03:10 IST|Sakshi
ఎందుకు ఓడారంటే

 వాషింగ్టన్: హిల్లరీదే గెలుపు అంటూ సర్వేలు, పోల్స్ ఘంటాపథంగా చెప్పినా ఆమె ఓటమికి కారణాలేంటి? ట్రంప్‌పై మహిళలు, లాటిన్ అమెరికన్ ఓటర్ల వ్యతిరేకతను హిల్లరీ ఎందుకు ఓట్ల రూపంలో మలుచుకోలేకపోయారు. కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలన్నట్లు హిల్లరీ ఓటమికి అనేక అంశాలు పనిచేశాయని విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా ఆఫ్రో-అమెరికన్, లాటిన్, ఆసియన్ ఓటర్లతో పాటు యువ ఓటర్లను ఆకట్టుకోవడంలో హిల్లరీ విఫలమయ్యారు. దీంతో ఆ వర్గాలకు చెందిన ఓటర్లు ఓటింగ్‌లో ఎక్కువగా పాల్గొనలేదని సీఎన్‌ఎన్ చానల్ పేర్కొంది. 2012లో రిపబ్లికన్ అభ్యర్థి మిట్ రోమ్నీకి పడ్డ నల్లజాతీయుల, లాటిన్ ఓట్ల కంటే ట్రంప్‌కు ఈ సారి ఎక్కువ వచ్చాయి. హిల్లరీ ప్రచారం చేసిన ప్రాంతాల్లో ఆమెకు ఓట్లు బాగానే పడ్డా... అధ్యక్షుడు ఒబామా ప్రచారం నిర్వహించిన చోట్ల డెమోక్రాట్లకు ఓట్ల శాతం తగ్గడం విశేషం.
 
 ట్రంప్‌పై వ్యతిరేకత ఓట్లుగా మలచుకోవడంలో విఫలం

 4 శాతంగా ఉన్న ఆసియన్ ఓటర్ల మద్దతు తగ్గడం కూడా హిల్లరీకి నష్టం కలిగించింది. మెక్సికో సరిహద్దుల్లో గోడ కడతానంటూ ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసినా... ఆ దేశస్తుల ఓట్లు పూర్తిగా హిల్లరీకి పడలేదు. 65 శాతం మంది హిల్లరీకి ఓటు వేయగా... 29 శాతం ట్రంప్‌కు ఓటేయడం అందరినీ ఆశ్చర్యపరచింది. 2012లో ఒబామాకు 71 శాతం మంది మెక్సికన్లు ఓటేశారు. ఇక స్పానిష్ మాట్లాడే ప్రజలు 2012తో పోల్చితే ఒక శాతం తక్కువగా హిల్లరీకి మద్దతిచ్చారు. యువ ఓటర్లును ఆకట్టుకోవడంలో హిల్లరీ విఫలమయ్యారు. 18 నుంచి 29 మధ్య వయసున్న వారిలో 55 శాతం మంది హిల్లరీకి ఓటేయగా... ట్రంప్‌కు 37 శాతం మంది ఓటేశారు. 2012లో ఒబామాకు 60 శాతం యువ ఓటర్లు మద్దతు పలికారు. మహిళల ఓట్లలో హిల్లరీకి 54 శాతం, ట్రంప్‌కు 42 శాతం పడ్డాయా. 2012లో ఒబామాకు 55 శాతం మహిళల ఓట్లు దక్కాయా. ట్రంప్ పట్ల 70 శాతం మహిళలు వ్యతిరేకత వ్యక్తం చేసినా 42 శాతం ఓటేయడం విశేషం.

మరిన్ని వార్తలు