70 ఏళ్ల తర్వాత బయటడింది..

27 Aug, 2018 14:43 IST|Sakshi
అధికారులు నిర్విర్యం చేసిన రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటి బాంబు

ఫ్రాంక్‌ఫర్ట్ : రెండు ప్రపంచ యుద్ధాలు మానవ జాతిని అతలాకుతలం చేశాయి. మరీ ముఖ్యంగా రెండో ప్రపంచ యుద్ధం సృష్టించిన బీభత్సాన్ని ప్రపంచం నేటికి మర్చిపోలేదు. అందుకు ప్రధాన కారణం ఈ యుద్ధంలో వాడిన బాంబులే. ఇప్పుడున్నంత టెక్నాలజీ లేని కాలంలోనే ఆనాడు తయారు చేసిన బాంబులు తీవ్ర మారణహోమాన్ని సృష్టించాయి. అంతటి విపత్తు సృష్టించిన నాటి బాంబు ఒకటి బయటపడటంతో జనాలు మరోసారి భయభ్రాంతులకు గురయ్యారు.

ఈ సంఘటన జర్మనిలో చోటుచేసుకుంది. భవన నిర్మాణ పనుల చేపడుతున్న సమయంలో ఇది బయటపడింది.  విషయం తెలుసుకున్న అధికారులు లుడ్‌విగ్‌షాఫెన్ నగరంలోని 18500 మంది ప్రజలను ఖాళీ చేయించారు. అనంతరం బాంబు డిస్పోజల్ టీమ్ దానిని సురక్షితంగా నిర్వీర్యం చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. రెండో ప్రపంచ యుద్ధం జరిగే సమయంలో జర్మనీపై అమెరికా దళాలు వేసిన బాంబు ఇది. దీని బరువు సుమారు 500 కిలోలు.

బాంబు నిర్వర్యం చేసే క్రమంలో అధికారులు ముందు జాగ్రత్త చర్యగా కిలోమీటరు మేర పరిసర ప్రాంతాల్లోని ప్రజలను మరోచోటికి తరలించామని అధికారులు తెలిపారు. అంతేకాక కేవలం గంట సేపట్లోనే ఈ బాంబును నిర్వీర్యం చేశామన్నారు. అనంతరం అధికారులు బాంబును నిర్వీర్యం చేశామని, నగరంలోని ప్రజలంతా మళ్లీ వాళ్ల ఇళ్లకు రావచ్చని ఓ అధికారి ట్వీట్ చేశారు. అంతేకాక ఆ బాంబు తాలూకు ఫొటోను కూడా పోస్ట్ చేశారు.

రెండో ప్రపంచ యుద్ధం ముగిసి ఇప్పటికి 70 ఏళ్లు గడిచిన తర్వాత కూడా జర్మనీలో ఇలాంటి పేలని బాంబులు అక్కడక్కడా కనిపిస్తూనే ఉన్నాయి. గతేడాది కూడా ఫ్రాంక్‌ఫర్ట్‌లో 1.8 టన్నుల బరువున్న బ్రిటన్ బాంబు బయటపడింది. ఆ సమయంలో నగరంలోని 60 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో బెర్లిన్ సెంట్రల్ రైల్వే స్టేషన్ దగ్గర కూడా మరో బ్రిటిష్ బాంబు కనిపించింది.

మరిన్ని వార్తలు