మెసేజ్, కాల్స్‌తోనూ పర్యావరణానికి ముప్పు

5 Mar, 2018 03:31 IST|Sakshi

టొరంటో: మెసేజ్, కాల్స్‌తో పర్యావరణానికి నష్టం ఎలాగా అని ఆలోచిస్తున్నారా..? ఈ రెండింటితోనే కాదు.. మీరు డౌన్‌లోడ్‌ లేదా అప్‌లోడ్‌ చేసే వీడియోలు, వీడియో కాల్స్, ఇంటర్నెట్‌ వినియోగం వీటన్నిటి వల్ల పర్యావరణానికి తీవ్ర హాని జరుగుతోందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఎందుకంటే వీటిని ప్రాసెస్‌ చేయడానికి పెద్దఎత్తున డేటా కేంద్రాలు, కమ్యూనికేషన్‌ వ్యవస్థలు నిరంతరాయం పనిచేస్తుంటాయి.

దీంతో ఈ కేంద్రాల నుంచి భారీగా వెలువడే కర్బన ఉద్గారాల వల్ల పర్యావరణానికి పెద్ద ఎత్తున నష్టం వాటిల్లుతోందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. 2040 నాటికి పర్యావరణానికి జరిగే నాశనంలో స్మార్ట్‌ఫోన్స్, డేటా సెంటర్లదే అధిక భాగం ఉంటుందని హెచ్చరించారు. దీనిలో భాగంగా స్మార్ట్‌ఫోన్స్, ల్యాప్‌టాప్స్, ట్యాబ్లెట్స్, డెస్క్‌టాప్స్, డేటా సెంటర్లు, ఇతర కమ్యూనికేషన్‌ నెట్‌వర్క్స్‌లో వినియోగించే కర్బన ఉద్గారాలపై వారు పరిశోధన చేపట్టారు. ప్రస్తుతం ఈ రంగం నుంచి వెలువడే కర్బన్‌ ఉద్గారాల శాతం 1.5 గా ఉందని.. 2040 నాటికి 14 శాతానికి చేరుకుంటుందన్నారు.
 

>
మరిన్ని వార్తలు