రాబర్ట్‌ ముగాబే కన్నుమూత

6 Sep, 2019 11:23 IST|Sakshi

సింగపూర్‌ : జింబాబ్వే మాజీ అధ్యక్షుడు రాబర్ట్‌ ముగాబే (95) మరణించారని ఆ దేశ అధ్యక్షుడు ఎమర్సన్‌ మగగ్వా తన అధికారిక ట్విటర్‌ ఖాతాలో వెల్లడించారు. రాబర్ట్‌ ముగాబే మరణం తమను తీవ్రంగా కలిచివేసిందని ఈ విషాద వార్తను తాను ప్రకటిస్తున్నానని పేర్కొన్నారు. వయోభారం, అనారోగ్యం కారణంగా ఆయన కన్నుమూశారని అధికార వర్గాలు తెలిపాయి. ఏప్రిల్‌ నుంచి సింగపూర్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ముగాబే కన్నుమూశారని ఆయన కుటుంబ సభ్యులు నిర్ధారించారు. గతంలోనూ ఆయన పలుమార్లు అనారోగ్యానికి గురై చికిత్స పొందారని పేర్కొన్నాయి. కాగా ముగాబే మూడు దశాబ్ధాల సుదీర్ఘ పాలనకు 2017 నవంబర్‌లో సైనిక తిరుగుబాటు ద్వారా తెరపడింది. స్వాతంత్ర్యానంతరం జరిగిన జింబాబ్వే తొలి ఎన్నికల్లో ముగాబే విజయం సాధించి 1980లో తొలి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. 1987లో దేశ అధ్యక్ష పగ్గాలను స్వీకరించారు. జింబాబ్వే జాతిపితగా, స్వేచ్ఛ కోసం పోరాడిన యోధుడిగా ముగాబే పేరొందారు.

 


 

మరిన్ని వార్తలు