పసికూన చేతిలో పరాభవం.. కెప్టెన్‌ మార్పు.. నూతన సారధిగా స్టార్‌ ఆల్‌రౌండర్‌

5 Nov, 2023 11:29 IST|Sakshi

జింబాబ్వే క్రికెట్‌ బోర్డు తమ టీ20 జట్టుకు నూతన కెప్టెన్‌ను నియమించింది. ఇటీవల స్వదేశంలో పసికూన నమీబియాతో చేతిలో ఘోర పరాభవం ఎదురైన నేపథ్యంలో ఆ దేశ క్రికెట్‌ బోర్డు ఆల్‌ ఫార్మాట్‌ కెప్టెన్‌ క్రెయిగ్‌ ఎర్విన్‌పై వేటు వేసింది. ఎర్విన్‌ స్థానంలో జింబాబ్వే టీ20 జట్టు సారధిగా స్టార్‌ ఆల్‌రౌండర్‌ సికందర్‌ రజా నియమించబడ్డాడు. ఎర్విన్‌ టెస్ట్‌, వన్డే జట్లకు కెప్టెన్‌గా పరిమితం చేయబడ్డాడు. వచ్చే నెలలో జరుగబోయే టీ20 వరల్డ్‌కప్‌ క్వాలిఫయర్స్‌ను దృష్టిలో ఉంచుకుని జింబాబ్వే క్రికెట్‌ బోర్డు ఈ కీలక మార్పు చేసింది.  

జింబాబ్వే క్రికెట్‌ బోర్డు టీ20 జట్టు కెప్టెన్‌ను మార్చడంతో పాటు మరిన్ని కీలక మార్పులు కూడా చేసింది. మాజీ హెడ్‌ కోచ్‌ డేవ్‌ హటన్‌కు మరోసారి అవే బాధ్యతలు అప్పజెప్పింది. అదనంగా హటన్‌కు సెలక్షన్‌ ప్యానెల్‌లో చోటు కల్పించింది. హటన్‌తో పాటు మాజీ కెప్టెన్‌ ఎల్టన్‌ చిగుంబరకు కూడా సెలక్షన్‌ ప్యానెల్‌లో చోటు దక్కింది. జింబాబ్వే క్రికెట్‌ కమిటీ నూతన చైర్మన్‌గా బ్లెస్సింగ్‌ గొండోను నియమించింది. ఈ కమిటీలో సభ్యులుగా హమిల్టన్‌ మసకద్జ, కెన్యోన్‌ జెహ్లా, రసెల్‌ టిఫిన్‌, జూలియా చిబాబ, డేవ్‌ హటన్‌, చిగుంబరలకు చోటు దక్కింది. కాగా, స్వదేశంలో ఇటీవల నమీబియాతో జరిగిన టీ20 సిరీస్‌లో జింబాబ్వే 2-3 తేడాతో ఓటమిపాలైంది.  

మరిన్ని వార్తలు