మిస్టర్ కురూపి అతడు కాదు.. నేనే

24 Nov, 2015 19:34 IST|Sakshi
మిస్టర్ కురూపి అతడు కాదు.. నేనే

హరారే: జింబాబ్వే రాజధాని హరారేలో పీజెంట్ అనే పబ్ అందవికారంగా ఉండే వాళ్లకూ పోటీలు నిర్వహించి ‘మిస్టర్ అగ్లీ’ టైటిల్‌తోపాటు 500 డాలర్లు (రూ.33వేలు) నగదు బహుమతి ఇస్తోంది. మిస్టర్ కురూపి.. ఏమాత్రం అందంగా లేకుండా, అత్యంత అందవిహీనంగా ఉండేవాళ్లను ఎంపిక చేసేందుకు పెట్టిన పోటీ ఇది. 'జింబాబ్వే మిస్టర్ అగ్లీ 2015' అనే పేరుతో పెట్టిన  ఈ పోటీలో 42 ఏళ్ల మిసన్ సెరె అనే వ్యక్తి గెలిచాడు. అయితే.. అతడి కురూపితనం సహజంగా వచ్చినది కాదని, అతడికంటే తానే పెద్ద కురూపినని ఈ పోటీలో రన్నరప్‌గా వచ్చిన విలియం మస్‌విను ఆరోపిస్తున్నాడు. మిసన్ సెరెకి పళ్లు ఊడటం వల్లే అతడు కురూపిగా కనిపించాడు తప్ప.. నిజానికి అతడు అందగాడేనని మండిపడుతున్నాడు.


'నేనే అందంగా లేను... నేను సహజమైన కురూపిని. అతడికి పళ్లు ఊడటం వల్లే టైటిల్ గెలుచుకున్నాడు. నేను ఇంతకుముందు వరుసగా మూడుసార్లు ఈ టైటిల్‌ను గెలవడంతో పేరు ప్రఖ్యాతులు రావడంతో పాటు నా జీవితమే పూర్తిగా మారిపోయింది' అని రన్నరప్‌ విలియం మస్‌వినూ అన్నాడు. ఈ పోటీల్లో అతను100 డాలర్ల ప్రైజ్‌ మనీ గెలుపొందాడు. ఈ టైటిల్ గెలుచుకోవడానికి పళ్లు ఊడగొట్టుకోమంటారా అని మరో పోటీదారుడు ఆవేదన వ్యక్తం చేశాడు.

అయితే.. న్యాయనిర్ణేతలు ఇచ్చిన తీర్పును అందరం గౌరవించాలని అగ్లీ పోటీల విజేత మిసన్ సెరె అన్నాడు. మరి అతడికి ఏకంగా 500 డాలర్ల ప్రైజ్ మనీ వచ్చింది. ఈ పోటీలను జింబాబ్వేకే పరిమితం చేయకుండా, ప్రపంచస్థాయిలో 2017 నుంచి 'మిస్టర్ అగ్లీ వరల్డ్'ని ప్రారంభించే యోచనలో ఉన్నట్టు నిర్వాహకులు తెలిపారు.

మరిన్ని వార్తలు