'హ్యూస్.. ఇంకా నీ జ్ఞాపకాలతోనే' | Sakshi
Sakshi News home page

'హ్యూస్.. ఇంకా నీ జ్ఞాపకాలతోనే'

Published Tue, Nov 24 2015 6:11 PM

'హ్యూస్.. ఇంకా నీ జ్ఞాపకాలతోనే'

సిడ్నీ: ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిల్ హ్యూస్ మరణించి దాదాపు ఏడాది కావొస్తోంది. గత సంవత్సరం సిడ్నీలో స్థానిక జట్టుతో క్రికెట్ ఆడుతూ బౌలర్ సియాన్ అబోట్ వేసిన బౌన్సర్ కు గాయపడిన హ్యూస్.. కొన్ని రోజులు మృత్యువుతో పోరాడి ప్రాణాలు కోల్పోయాడు. ఆస్ట్రేలియా క్రికెట్ లో చోటు చేసుకున్న ఆ విషాదకర జ్ఞాపకాలు ఆటగాళ్లను ఇప్పటికీ వెంటాడుతూనే ఉన్నాయి. శుక్రవారం ఫిల్ హ్యూస్ మొదటి వర్థంతి సందర్భంగా ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్ తన ఆవేదనను వ్యక్తం చేశాడు.

ఆనాటి చేదు జ్ఞాపకాలు తనను ఇంకా కలచి వేస్తూనే ఉన్నాయని తెలిపాడు. ఒకపక్క కూతురు రాకతో  తన జీవితంలోకి ఆనంద క్షణాలు రాగా, మరోపక్క తన ప్రియ మిత్రుడు, 'తమ్ముడు' హ్యూస్ వర్థంతి రావడం తీరని బాధను మోసుకొచ్చిందన్నాడు. హ్యూస్ జ్ఞాపకాలు ఎప్పటికీ తనతో ఉంటాయన్నాడు. హ్యూస్ అర్థాంతరంగా మమ్మల్ని వదిలి వెళ్లిపోవడం గురించే ప్రతీ రోజు మదన పడుతూనే ఉంటానని క్లార్క్ తెలిపాడు. హ్యూస్ మరణాన్ని జీర్ణించుకోవడం చాలా కష్టంగా ఉందన్నాడు.

ఆస్ట్రేలియా తరపున 25 టెస్టు మ్యాచ్ లు ఆడిన ఫిల్ హ్యూస్ గతేడాది నవంబర్ 27 వ తేదీన తుదిశ్వాస విడిచాడు. క్రికెట్ ఆడుతున్న సమయంలో అబాట్ వేసిన కారణంగా హ్యూస్ కుప్పుకూలిపోయాడు. ఆ తరువాత హ్యూస్ ను బ్రతికేంచేందుకు డాక్టర్లు చేసిన ప్రయోగాలు ఫలించలేదు.

Advertisement
Advertisement