ఇదేం‘ధరో’!

12 Jan, 2018 09:37 IST|Sakshi

కొనక ముందొకటి.. కొన్నాక మరో ధర

మిర్చి కొనుగోళ్లలో దోపిడీకి గురవుతున్న రైతులు

వ్యాపారులకే కొమ్ము కాస్తున్న మార్కెట్‌ ఉద్యోగులు

ఖమ్మం వ్యవసాయం: ఏకమయ్యారు.. రైతన్నను దగా చేస్తున్నారు.. ఆరుగాలం శ్రమించి.. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని పండించిన పంటను మార్కెట్‌లో అమ్మకానికి తెస్తే.. నిలువు దోపిడీ చేస్తున్నారు.. కఠిన నిబంధనలు, పారదర్శకంగా మార్కెట్‌ నిర్వహణ అని ప్రభుత్వం చెబుతున్నా.. అవి మాటలు, కాగితాలకే  పరిమితమయ్యాయి. వ్యాపారులు, కమీషన్‌ వ్యాపారులు, దడవాయిలు, కార్మికులు, మార్కెట్‌ ఉద్యోగులు సిండికేట్‌గా మారి మోసానికి ఒడిగడుతున్నారు. ఇది ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో నిత్య తంతులా మారింది.  ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో సరుకు అమ్మకానికి తెచ్చిన రైతులు నిలువు దోపిడీకి గురవుతున్నారు. రైతుల పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించడానికి కృషి చేయాల్సిన ఉద్యోగులు కక్కుర్తిపడి నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. ప్రస్తుతం మిర్చికి ఉన్న ధర ప్రకారం కూడా కొనుగోళ్లు చేయకుండా సిండికేట్‌గా ఏర్పడి రైతులను దగా చేస్తున్నారు.

ప్రస్తుతం మిర్చి క్వింటాల్‌ ధర రూ.9వేలకు పైగా ఉండగా.. ఖమ్మం మార్కెట్‌లో ఒకటి, రెండు లాట్‌లకు ఆ ధర పెడుతూ.. మిగిలిన లాట్లకు రూ.8వేలకు మించి ధర పెట్టడం లేదు. సరుకు నాణ్యత లేదని, తేమగా ఉందని పేర్కొంటూ రూ.6వేలకు కూడా కొనుగోలు చేస్తున్నారు. గురువారం రఘునాథపాలెం మండలం పడమటితండాకు చెందిన మహిళా రైతు మాలోత్‌ బుల్లెమ్మ 8 బస్తాల మిర్చిని విక్రయానికి తెచ్చింది. ఆ సరుకును కమీషన్‌దారు పలువురు ఖరీదుదారులకు చూపించారు. పీకేఆర్‌ పేరుతో ఉన్న ఖరీదుదారుడు క్వింటాల్‌కు రూ.8,700 ధర నిర్ణయించాడు. అదే ధర వస్తుందనుకున్న బుల్లెమ్మకు వ్యాపారి, కమీషన్‌ వ్యాపారి, అక్కడున్న మార్కెట్‌ ఉద్యోగి పెద్ద షాక్‌ ఇచ్చాడు.

మార్కెట్‌లో ధర నిర్ణయించిన తర్వాత యార్డు గేటు వద్ద ఉన్న సూపర్‌వైజర్‌ లాట్‌ నంబర్‌తో నిర్ణయించిన ధరను పేర్కొంటూ.. సరుకును కాంటా పెట్టి సంబంధిత వ్యాపారికి అప్పగించాలని దడవాయిలకు బాధ్యత అప్పగిస్తాడు. నిరక్షరాస్యురాలైన బుల్లెమ్మ మిర్చికి మార్కెట్‌ ఉద్యోగి క్వింటాల్‌కు రూ.7వేలుగా పేర్కొంటూ దడవాయిని సరుకు కాంటాకు పంపించారు. దీంతో రైతు బుల్లెమ్మ మరో రైతుకు తన పంటకు ఎంత ధర పడిందో చూడమని చిట్టీ ఇచ్చింది. అందులో రూ.7వేల ధరగా ఉంది. దీంతో ఆమె లబోదిబోమంటూ యార్డు గేటు వద్దకు చేరి తనకు అన్యాయం చేశారని బోరున విలపించింది. ఈ క్రమంలోనే విధుల్లో ఉన్న మార్కెట్‌ సూపర్‌వైజర్‌ అక్కడి నుంచి జారుకున్నారు. దడవాయిలు తమ తప్పు లేదని ఆమెకు చెప్పారు. ఇదిలా ఉండగా, సరుకు కాంటా, తరలింపు కూడా జరిగిపోయింది. ఈ వ్యవహారం ఉన్నతాధికారుల దృష్టికి చేరుతున్న క్రమంలో కొందరు ఆ మహిళను అక్కడి నుంచి తీసుకెళ్లి తొలుత నిర్ణయించిన ధర ఇప్పిస్తామని చెప్పారు. క్వింటాల్‌కు ఏకంగా రూ.1,700 తేడాతో రైతుకు దాదాపు రూ.7వేల నష్టం వాటిల్లుతోంది. ఇటువంటి ఘటనలు మార్కెట్‌లో నిత్యం చోటు చేసకుంటున్నాయి.

ఏకమై దగా..
పంట మార్కెట్‌కు వచ్చింది మొదలు అడుగడుగునా రైతు అన్యాయానికి గురవుతూనే ఉన్నాడు. పంటకు ధర నిర్ణయించే ఖరీదుదారులంతా సిండికేట్‌గా ఏర్పడి ధర పెడుతున్నారు. ఇక కమీషన్‌ వ్యాపారులు కూడా ఖరీదుదారులతో కూడపలుక్కొని ధర పెట్టిస్తారు. ఈ తతంగమంతా తెలిసిన మార్కెట్‌ ఉద్యోగులకు ఆమ్యామ్యాలు ముట్టజెబుతూ అక్రమాలను మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగిస్తున్నారు. కాగా.. పంట పరిశీలనలో ఓ ధరను నిర్ణయిస్తూ.. తీరా కాంటా సమయంలో సరుకు నాణ్యతగా లేదని చెబుతూ ధరలో కోత పెడుతున్నారు. క్వింటాల్‌కు రూ.400 నుంచి రూ.500 వరకు కోత పెడుతున్నా.. అధికారులు నియంత్రించలేకపోతున్నారు.  

వ్యాపారులకు కొమ్ముకాస్తున్న ఉద్యోగులు
పంట విక్రయంలో తమకు అన్యాయం జరిగిందని  రైతులు మొరపెట్టుకున్నా మార్కెట్‌ ఉద్యోగులు మాత్రం వ్యాపారులకే కొమ్మకాస్తున్నారు. సరుకు నాణ్యత లేనందునే ధర తగ్గించారని, ఆ ధరకే అమ్మాలని వ్యాపారులకు అండగా నిలుస్తున్నారు.  

బదిలీ అయినా..
ఖమ్మం మార్కెట్‌లో బదిలీలు జరిగినప్పటికీ కొందరు అక్రమాలకు రుచిమరిగి ఇక్కడి నుంచి వెళ్లేందుకు ఇష్టపడటం లేదు. ఇక్కడ సూపర్‌వైజర్‌గా పనిచేస్తూ.. అసిస్టెంట్‌ సెక్రటరీగా పదోన్నతి పొంది కొత్తగూడెం బదిలీ అయిన ఓ ఉద్యోగి గురువారం ఖమ్మం మార్కెట్‌ మిర్చి యార్డులో విధులు నిర్వహిస్తున్నాడు. మీరు బదిలీ అయ్యారుగా అని ప్రశ్నిస్తే.. అవునని, పని ఉండి వచ్చానని బుకాయించాడు. కాగా.. రైతు బుల్లెమ్మకు ధరలో అన్యాయం జరిగిన సమయంలో ఈ అధికారే మిర్చిగేటు వద్ద ఉన్నాడు.


పరిశీలించి.. చర్యలు తీసుకుంటాం..
రైతుల పంటకు తగిన ధర కల్పించటంలో ఎటువంటి చర్యకైనా వెనకాడం. పంటకు ధర నిర్ణయించి.. తిరిగి తగ్గిస్తే సహించేది లేదు. ఇటువంటి ఘటనలపై నిఘా పెంచాం. రైతు బుల్లెమ్మకు జరిగిన అన్యాయంపై సమాచారం ఉంది. సమగ్రంగా పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటాం. ఇటువంటివి పునరావృతం కాకుండా చూస్తాం.  – రత్నం సంతోష్‌కుమార్, ఉన్నత శ్రేణి కార్యదర్శి
ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌ కమిటీ

మరిన్ని వార్తలు