కార్చిచ్చు..!

18 Mar, 2018 10:26 IST|Sakshi

టీఆర్‌ఎస్‌లో గ్రూపుల లొల్లి  

నామమాత్ర దశ నుంచి కిటకిటలాడుతున్న పార్టీ 

వలసవాదులు, టీజేఏసీ నుంచి వచ్చిన వారితో గందరగోళం 

పదవుల్లో అవకాశమివ్వలేదని ‘ఉద్యమ’ కార్యకర్తల గుర్రు 

పార్టీ మారేందుకు పలు మండలాల్లో నాయకుల ఏర్పాట్లు 

సాక్షి, కొత్తగూడెం: తెలంగాణ ప్రత్యేక సాధన కోసం 13 ఏళ్ల పాటు సుదీర్ఘంగా ఉద్యమించినప్పటికీ జిల్లాలో టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రాభవం నామమాత్రంగానే ఉండేది. 2014లో ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత జరిగిన సాధారణ ఎన్నికల్లోనూ జిల్లాలో ఒక కొత్తగూడెం శాసనసభ స్థానంలో మాత్రమే ఆ పార్టీ విజయం సాధించింది. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి రావడంతో జిల్లా వ్యాప్తంగా వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు ఇబ్బడి ముబ్బడిగా వచ్చి చేరారు. టీజేఏసీ నుంచి సైతం చేరారు. కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్‌సీపీ, సీపీఐ, సీపీఎం, న్యూడెమోక్రసీ పార్టీలకు చెందిన సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు సైతం టీఆర్‌ఎస్‌ కండువా కప్పుకున్నారు. జిల్లాలో వైఎస్సార్‌సీపీ తరఫున గెలిచిన పినపాక, అశ్వారావుపేట ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, తాటి వెంకటేశ్వర్లు, కాంగ్రెస్‌ నుంచి గెలిచిన ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు. వీరి వెంట ఆయా పార్టీల నుంచి భారీగా తరలివెళ్లారు. ఇక టీడీపీ ఆవిర్భావం నుంచి ఉన్న తుమ్మల నాగేశ్వరరావు సైతం టీఆర్‌ఎస్‌లో చేరారు. ఆయనతో టీడీపీ నుంచి భారీగా వలసలు రాగా, తర్వాత మంత్రి కావడంతో మరింత మంది కీలక నాయకులు ఆ పార్టీలో చేరారు. దీంతో నామమాత్ర దశ నుంచి నాయకులు, కార్యకర్తలతో కిటకిటలాడే స్థితికి చేరింది. దీం తో సహజంగానే గ్రూపుల లొల్లి మొదలైంది.  

 మొదటి నుంచీ ఉన్న కార్యకర్తల గుర్రు.. 
2001లో ఆవిర్భవించిన టీఆర్‌ఎస్‌ ఉద్యమ పార్టీగా ఉన్నకాలంలో జిల్లాలో కొద్దిమంది నాయకులు, కార్యకర్తలు పాలుపంచుకున్నారు. రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత తమ భవిష్యత్తు బాగుంటుందని ఆశించారు. పార్టీ పదవులు, నామినేటెడ్‌ పోస్టుల్లో తమకు ప్రథమ ప్రాధాన్యత ఉంటుందని భావించారు. అయితే చివరకు మండలాలు, పట్టణాల్లో పార్టీ పదవులతో పాటు, రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన రైతు సమన్వయ సమితుల్లోనూ వీరికి అవకాశాలు కల్పించలేదు. పార్టీలు మారి వచ్చిన వారికే అన్ని పదవులూ ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద వచ్చిన ట్రాక్టర్లు సైతం వలస నాయకులే తన్నుకుపోయారని గగ్గోలు పెడుతున్నారు. రైతు సమన్వయ సమితుల్లో ఉద్యమకారులకే అవకాశం కల్పిస్తున్నట్లు నేరుగా శాసనసభలోనే కేసీఆర్‌ ప్రకటించినప్పటికీ.. జిల్లాలో మాత్రం అందుకు విరుద్ధంగా తమను వదిలేసి వలస నాయకులకే పార్టీ, రైతు సమన్వయ సమితుల పదవులు అప్పజెప్పారని ఉద్యమకారులు గుర్రుగా ఉన్నారు. మరోవైపు ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి వర్గాలు ఉండడంతో పరిస్థితి గందరగోళంగా మారింది. 

 పార్టీ మారేందుకు కొందరు సిద్ధం.. 
ఈ పరిస్థితుల్లో వివిధ పార్టీల నుంచి టీఆర్‌ఎస్‌లోకి వచ్చిన కొందరు నాయకులు, కార్యకర్తలు తిరిగి బయటకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఎక్కువ మంది కాంగ్రెస్‌ పార్టీలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. అశ్వారావుపేట నియోజకవర్గంలో జిల్లా స్థాయిలో కీలక పదవులు నిర్వహించిన వారు సైతం కాంగ్రెస్‌లోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం.    

మరిన్ని వార్తలు