పెళ్లయిన వారూ పేట్రేగుతున్నారు..

28 Jan, 2020 09:04 IST|Sakshi

బెంగళూర్‌ : వివాహేతర సంబంధాల మోజులో సంసారాలు ఛిద్రమవుతున్నా అనైతిక బంధాల కోసం అర్రులు చాచే ధోరణి పెరుగుతోంది. తాజాగా వివాహేతర డేటింగ్‌ యాప్‌లో ఏకంగా ఎనిమిది లక్షల మంది వివాహితులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు.తమ భాగస్వాములను మోసం చేస్తూ సాగిస్తున్న రహస్య బంధాల్లో స్ర్తీ, పురుషులు ఇద్దరూ పాలుపంచుకోవడం గమనార్హం. ఈ డేటింగ్‌ యాప్‌లో టెక్‌ హబ్‌ బెంగళూర్‌ నుంచి అత్యధిక సంఖ్యలో సబ్‌స్క్రైబర్లు నమోదయ్యారు. జనవరి తొలి వారంలో డేటింగ్‌ యాప్‌కు సబ్‌స్క్రైబర్లు వెల్లువెత్తారు. ఈ ఏడురోజులూ రోజుకు 300 శాతం చొప్పున సబ్‌స్క్రిప్షన్‌ పెరగ్గా, నెలమొత్తంలో వచ్చిన సబ్‌స్క్రిప్షన్ల కంటే తొలి వారంలో వచ్చినవి ఏకంగా 250 శాతం అధికం.

నూతన సంవత్సర వేడుకలు ముగిసి దంపతులు తమ పనుల్లో నిమగ్నమవడంతో పాటు పిల్లల వింటర్‌ వెకేషన్‌ ముగిసిన క్రమంలో వివాహేతర బంధాల డేటింగ్‌ యాప్‌కు సబ్‌స్క్రిప్షన్‌లు వెల్లువెత్తాయని నివేదిక వెల్లడించింది. ఈ యాప్‌లో ఎక్కువ మంది బెంగళూర్‌, ముంబై, హైదరాబాద్‌, కోల్‌కతా, ఢిల్లీ, పూణే, చెన్నై, గుర్‌గావ్‌, అహ్మదాబాద్‌, జైపూర్‌, చండీగఢ్‌, లక్నో, కొచ్చి, నోయిడా, వైజాగ్‌, నాగపూర్‌, సూరత్‌, ఇండోర్‌, భువనేశ్వర్‌ నగరాలకు చెందిన వారు అధికంగా ఉన్నారు. ఈ యాప్‌ వృద్ధి 567 శాతం పైగా ఉండటంతో వివాహ బంధానికి వెలుపల అనైతిక బంధాల కోసం ఎంతగా వెంపర్లాడుతున్నారనేది వెల్లడవుతోందని ఫ్రెంచ్‌ ఆన్‌లైన్‌ డేటింగ్‌ కమ్యూనిటీ వేదిక నివేదిక తెలిపింది.

చదవండి : ప్రియుడితో పారిపోయేందుకు మహిళ ఘాతుకం..

మరిన్ని వార్తలు