మీదే బాధ్యత

12 Jan, 2018 10:17 IST|Sakshi

మీ బోధనకు గీటురాయిగా పదో తరగతి ఫలితాలు

మార్చి 15 వరకు సబ్జెక్టు టీచర్లకు సెలవులు లేవు

‘ఎస్సెస్సీ’ సమీక్ష సమావేశంలో కలెక్టర్‌ రొనాల్డ్‌రోస్‌

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌ : ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పదో తరగతి విద్యార్థులు ఉత్తీర్ణత సాధించకుంటే ఉపాధ్యాయులే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని కలెక్టర్‌ రొనాల్డ్‌రోస్‌ స్పష్టం చేశారు. ఉపాధ్యాయుల బోధన ఎలా ఉందనే విషయానికి పది ఫలితాలే గీటురాయి కానున్నాయని చెప్పారు. జిల్లా కేంద్రంలోని జెడ్పీ సమావేశ మందిరంలో ప్రభుత్వ ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులతో పదో తరగతి పరీక్షలపై గురువారం ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. చిన్నచిన్న ప్రైవేట్‌ పాఠశాలలు సైతం వంద శాతం ఉత్తీర్ణత నమోదు చేస్తుంటే అన్ని సౌకర్యాలు, అవకాశాలు ఉండి కూడా ప్రభుత్వ పాఠశాలల్లో అలా జరగడం లేదని ప్రశ్నించారు.

అన్ని పాఠశాలల్లో సబ్జెక్టుల వారీగా వెనుకబడిన విద్యార్థులపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఉత్తీర్ణత సాధించేలా బోధించాలని సూచించారు. గత ఏడాది ఒక్క గణితంలోనే 4,400 మంది ఫెయిల్‌ అయ్యారని, ఈసారి అలా జరగడానికి వీల్లేదన్నారు. సరైన ఫలితాలు రాకుంటే మొదట పాఠశాల హెచ్‌ఎం, తర్వాత సబ్జెక్టు చెప్పిన ఉపాధ్యాయుడిని బాధ్యులుగా పరిగణిస్తామని కలెక్టర్‌ తెలిపారు. ఇక పూర్తి స్థాయిలో పర్యవేక్షించాల్సిన బాధ్యత ఎంఈఓలు తీసుకోవాలన్నారు. కాగా, హరితహారంలో మొక్కల పెంపకం, వివిధ వసతుల కోసం ఉపాధి హామీ పథకాన్ని వినియోగించుకోవాలని ఆయన సూచించారు. ఇక కస్తూర్బా గాంధీ పాఠశాలల్లో మెరుగైన వసతులు ఉన్నట్లుగానే ఫలితాలు కూడా ఉండాలని కలెక్టర్‌ స్పష్టం చేశారు.

మాల్‌ ప్రాక్టీస్‌ను ప్రోత్సహించొద్దు
పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ మాల్‌ ప్రాక్టీస్, చూచి రాతలకు ఆస్కారం ఇవ్వొద్దని కలెక్టర్‌ ఆదేశించారు. ఈ విషయమై ఇప్పటి నుంచే విద్యార్థులను సన్నద్ధం చేయాలన్నారు. ఇక పరీక్షలు పూర్తయ్యేంత వరకు సంబంధిత సబ్జెక్టు టీచర్లకు ఎలాంటి పరిస్థితుల్లో సెలవులు మంజూరు చేయొద్దని హెచ్‌ఎంలు, ఎంఈఓలకు సూచించారు. సమావేశంలో జిల్లా విద్యాశాఖ అ«ధికారి సోమిరెడ్డి, సెక్టోరల్‌ అ«ధికారులు హేమచంద్రుడు, చంద్రశేఖర్, డీసీఈబీ చైర్మన్‌ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు