నగ్నంగా కనిపించడం టాలెంటా?

21 Aug, 2014 12:57 IST|Sakshi
నగ్నంగా కనిపించడం టాలెంటా?

అమీర్ ఖాన్, షారుక్ ఖాన్.. పరిచయమక్కర్లేని పేర్లివి. ఇద్దరూ సినీ పరిశ్రమలో గొప్ప నటులుగా పేరొందినవారే, స్టార్‌లుగా వెలుగొందుతున్నవారే, బయటెక్కడైనా కలిస్తే చక్కగా పలకరించుకునే వారే. ఇదంతా కనిపించే కోణంలో ఓ భాగం మాత్రమే. కనిపించని మరో కోణంలో ఇద్దరూ స్టార్ స్టేటస్ కోసం ఒకర్నొకరు విమర్శించుకుంటూ.. నువ్వా? నేనా? అన్నట్లు ఫీలయ్యే ఒక సాధారణ ఈగో జీవులు. వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందనేంత శత్రుత్వం ఉందనేది ఎప్పుడూ బయటకు కనిపించకపోయినా.. అదే నిజమని చెప్పే సంఘటన ఇది.

ఈ మధ్యే విడుదలైన అమీర్ తాజా చిత్రం 'పీకే'కి సంబంధించిన న్యూడ్ పోస్టర్‌ సృష్టించిన సంచలనం అందరికీ తెలిసిందే. ఈ విషయంపైనే షారూక్ స్పందిస్తూ, 'నగ్నంగా నటించడం ఏమైనా గొప్ప విషయమా? దాన్ని టాలెంట్ అని ఎలా అంటాం?' అంటూ చురకలంటించారు. షారూఖ్, తన తాజా సినిమా 'హ్యాపీ న్యూ ఇయర్' ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో ఈ మాటలన్నారు.

వీరిద్దరి మధ్య ఈ మాటల యుద్ధం ఇప్పటిదేం కాదు. ఓసారి ఆమీర్ తన బ్లాగులో, 'మా కుక్క పేరు షారుక్ ఖాన్' అంటూ పోస్ట్ చేయడంతో రేగిన దుమారం అప్పట్లో ఓ హాట్ టాపిక్. ఇక వీరిద్దరి మధ్యన జరిగే మాటల యుద్ధానికి సల్మాన్ ఖాన్ అప్పుడప్పుడూ కాస్త మసాలా జోడిస్తుండడం కొసమెరుపు!

కాగా షారుక్ వ్యాఖ్యలను అమీర్ లైట్ తీసుకున్నట్లు కనిపిస్తోంది. తన మనసులో అనేక ఆలోచనలు ఉంటాయని, అయితే వాటన్నింటిని ఎప్పటికప్పుడూ వదిలించుకుంటానని తెలిపాడు. కొంతమంది ఎదుటవారిలో లోపాలు వెదికేందుకు ప్రయత్నిస్తారని, అలాంటివాటికి తాను దూరమని అమీర్ చెప్పుకొచ్చాడు.