నేను లోకల్‌

10 May, 2019 07:06 IST|Sakshi

గుర్తుపట్టి మరీ విష్‌ చేస్తున్నారు  

అలోవెరా నా గ్లామర్‌ సీక్రెట్‌

‘సాక్షి’తో హీరోయిన్‌ సిమ్రాన్‌ చౌదరి

హిమాయత్‌నగర్‌: ఆ అందం పుట్టి పెరిగింది మన హైదరాబాద్‌లోనే. ఇప్పటికి చేసినవి రెండు సినిమాలే అయినా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకోవడంతో పాటు తన నవ్వుతో కుర్రకారు గుండెల్లో నిలిచిపోయింది. చురుకైన చూపులతో 2017లో జరిగిన ఫెమీనా మిస్‌ ఇండియా–తెలంగాణ పోటీల్లో పాల్గొని ‘మిస్‌ తెలంగాణ’గా నిలిచింది. ఆమే సిమ్రాన్‌ చౌదరి. నటిగా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన సిమ్రన్‌.. ‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రంలో శిల్పగా మెరిసింది. ‘హమ్‌ తుమ్‌’ సినిమాలో హీరోయిన్‌గా చేసి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. త్వరలో హీరో సుశాంత్‌తో కలిసి కొత్త సినిమాతో మనముందుకు రానున్న సిమ్రాన్‌ చౌదరి హిమాయత్‌నగర్‌లో మెరిసింది. ఈ సందర్భంగా ‘సాక్షి’తో ప్రత్యేకంగా ముచ్చటించి ఎన్నో విషయాలు పంచుకుంది.

ఆ వివరాలు ఆమె మాటల్లోనే..  
నేను పుట్టి పెరిగిందంతా సిటీలోనే కాబట్టి నగరంపై అటాచ్‌ బాగా ఉంది. ఫ్రెండ్స్‌ తక్కువగానే ఉన్నారు. కానీ..ఉన్న వారితోనే ఎక్కువ టైం స్పెండ్‌ చేస్తుంటా. కాఫీ అంటే చాలా ఇష్టం. ఖాళీ దొరికినప్పుడల్లా ‘రోస్టరీ కాఫీ హౌజ్‌’కి వెళ్తుంటా. షూటింగ్‌ లేని సమయాల్లో ట్యాంక్‌బండ్, చార్మినర్, హైటెక్‌సిటీ ఏరియాల్లో చక్కర్లు కొడుతుంటా. టైం దొరికినప్పుడల్లా ట్రావెలింగ్‌ చేస్తుంటాను. బుక్స్‌ ఎక్కువగా చదువుతుంటా. సిటీలోనే చదువుకున్నాను. స్కూల్‌ ఎడ్యుకేషన్‌ అంతా ‘డీఆర్‌ఎస్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్, కాలేజీ సెంట్‌ ఫ్రాన్సిస్‌ ఉమెన్స్‌ డిగ్రీ కాలేజీలో సాగింది. నేను మోడలింగ్‌ చేస్తున్నప్పటి నుంచి ఫ్రెండ్స్‌ అందరూ యంకరేజ్‌ చేస్తుండేవాళ్లు. సినిమాల్లోకి అడుగుపెట్టాక వాళ్లను కలిస్తే చాలు తెగ ఆటపట్టింస్తుంటారు. 

యాడ్స్‌టూమూవీస్‌
సినిమాల్లోకి రావాలనే కోరిక చిన్నప్పటి నుంచి ఉంది. ఆ కోరికతోనే ముందుగా మోడలింగ్‌లోకి అడుగుపెట్టాను. అంతకంటే ముందుగా నా 12 ఏళ్ల వయసులో కొన్ని కమర్షియల్‌ యాడ్స్‌ చేశాను. అవి నాకెంతో గుర్తింపునిచ్చాయి. తర్వాత పలు దేశాల్లో మోడల్‌గా ర్యాంప్‌లో షోల్లో పాల్గొన్నాను. తర్వాత అలా సినిమాల్లోకి వచ్చాను. ఇప్పటికి చేసినవి రెండు సినిమాలే అయినా ప్రస్తుతం చేతినిండా పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఉన్నాయి.

అలోవెరాతోఅందం రెట్టింపు..
ఈ మధ్య అందరూ ఎందుకింత అందంగా ఉన్నావ్‌? ఏం తింటున్నావ్‌.. అంటూ అడుగుతున్నారు. అలా అడుగుతుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. చిన్నప్పటి నుంచి నేను అలోవెరా వాడుతున్నాను. అలోవెరా తింటాను, బాడీకి అప్లై చేస్తాను. అలోవెరా జ్యూస్‌ తాగుతాను. అదే నా అందం సీక్రెట్‌. డైలీ జిమ్, స్విమ్మింగ్‌ తప్పనిసరి. ఇంకా బాక్సింగ్, యోగా, బాస్కెట్‌బాల్, డ్యాన్స్‌ కూడా చేస్తుంటా. ఫుడ్‌ విషయంలో మాత్రం ఇంట్లో అమ్మ చేతి వంటలకే నా తొలి ఓటు.  

కెమెరా ముందూ, వెనకా ఒకేలా..
కెమెరా ముందొక విధంగాను.. వెనక మరో విధంగా ఉండటం నాకు రాదు. సినిమాలో చేసిన క్యారెక్టర్‌ని బట్టి ఆ అమ్మాయి బయట కూడా అలాగే ఉంటుందనుకోవడం తప్పు. అది చూసే వాళ్లను బట్టి ఉంటుంది. కేవలం పాత్ర కోసం అలా నటించాల్సి ఉంటుంది. అంతేతప్ప మరేం కాదు. పాత్రను బట్టి నటించే నేను మాత్రం వ్యక్తిత్వం విషయంలో మాత్రం కెమెరా ముందు.. వెనుకా ఒకేలా ఉంటాను.  

 ఐ యామ్‌ ఏ పెట్‌ లవర్‌
³ంపుడు జంతువులంటే నాకు చాలా ఇష్టం. వాటికి సేవ చేయాలనే తపన చిన్నప్పటి నుంచి ఉంది. అందుకే ‘బ్లూ క్రాస్‌’లో నేను కూడా వలంటీర్‌గా చేరిపోయా. సమయం దొరికినప్పుడల్లా అక్కడున్న పెట్స్‌కి సర్వీస్‌ చేస్తుంటా. వాటికేమైనా ఆపద వస్తే ఆదుకుంటా. అక్కడున్న సభ్యులతో కలసి నేను కూడా ఒక ఆర్డనరీ వలంటీర్‌గానే పనిచేస్తూ ఉండడంతో పాటు ఇష్టమైన జంతువులకు దగ్గరగా ఉండడం ఆనందాన్నిస్తుంది.

‘మజిలీ, జర్నీ’ మస్త్‌ ఉన్నాయ్‌  
 ఇటీవల ‘మజిలీ, జర్నీ’ సినిమాలు చూశా మస్త్‌ ఉన్నాయి. మజిలీలో నాగచైతన్య యాక్టింగ్‌కి చాలా కనెక్ట్‌ అయ్యాను. ఇక సమంత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఐ యామ్‌ బిగ్‌ ఫ్యాన్‌ ఆఫ్‌ హర్‌. హీరో మహేష్‌తో సినిమా చేయాలనే కోరిక ఉంది. బాలీవుడ్‌లో సంజయ్‌లీలా బన్సాలీ దర్శకత్వంలో ఒక్క సినిమా అయినా చేస్తాను. ప్రస్తుతం హీరో సుశాంత్‌ పక్కన హీరోయిన్‌గా చేస్తున్నాను. త్వరలో ఆ సినిమా అభిమానుల ముందుకు వస్తుంది.. అంటూ ముగిచింది. 

మరిన్ని వార్తలు