40 అంతస్థుల బిల్డింగ్‌పై సాహసం

22 Apr, 2014 23:42 IST|Sakshi
40 అంతస్థుల బిల్డింగ్‌పై సాహసం

బాలీవుడ్ స్టార్లలో మాస్ ఇష్టపడే హీరో ఎవరు? అంటే... టక్కున వచ్చే సమాధానం సల్మాన్‌ఖాన్. ఆటోల మీద, లారీల పైన, మెకానిక్ షాపుల్లో, బ్యాచ్‌లర్స్ రూముల్లో... ఇలా ఉత్తరాదిన ఎక్కడపడితే అక్కడ సల్మాన్ బొమ్మలే కనిపిస్తుంటాయి. అయితే... ఇక్కడే కాదు... ప్రపంచం మొత్తం ఈ కండలవీరుడికి అభిమానులున్నారని ఇటీవల జరిగిన ఓ సంఘటనతో స్పష్టమైంది. వివరాల్లోకెళ్తే... సినిమా షూటింగులకు సౌకర్యవంతంగా ఉండటం, నిర్మాతలకు ఖర్చు కూడా తక్కువగా అవుతుండటంతో ఇటీవల పోలండ్‌లో మన భారతీయ సినిమాల షూటింగులు ఊపందుకున్నాయి. ‘జిందగీ న మిలేగీ దొబారా’ చిత్రం కూడా అక్కడ తెరకెక్కిందే. ప్రస్తుతం పలు బాలీవుడ్ సినిమాల షూటింగులు పోలండ్‌లోనే రూపొందుతున్నాయి.
 
  అయితే, ఏ సినిమాకూ ఎదురుకాని సమస్య... సల్మాన్‌ఖాన్ హీరోగా రూపొందుతోన్న ‘కిక్’ సినిమాకు తలెత్తింది. పోలండ్ రాజధాని వార్సాలో ఈ సినిమాకు సంబంధించిన పతాక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు సాజిద్ నడియాడ్‌వాలా. పోలండ్ దేశంలోనే అత్యంత ఎత్తయిన బిల్డింగ్(కల్చర్ అండ్ సైన్స్) పై నుంచి వేళ్లాడుతూ, రకరకాల ఫీట్లు చేస్తూ సల్మాన్ ఫైట్ చేయాలి. అది నలభై అంతస్థుల బిల్డింగ్. సల్లూభాయ్ కెరీర్‌లోనే అత్యంత ప్రమాదకరమైన ఫీట్ ఇది. వారం రోజుల పాటు జరిగే ఈ ఫైట్ చిత్రీకరణ విషయంలో దర్శకుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారట. ఈ ఫైట్ వివరాలను పోలండ్‌లోని అత్యధిక సర్క్యులేషన్‌గల పత్రికైన ‘గజెటా వైబోర్కా’ ప్రచురించింది.
 
 దాంతో అక్కడి చానల్స్‌లో కూడా ఈ ఫైట్ గురించి పెద్ద ఎత్తున కథనాలు ప్రసారమయ్యాయి. దాంతో వేలాది మంది  అభిమానులు కల్చర్ అండ్ సైన్స్ బిల్డింగ్ వద్దకు చేరుకున్నారు. ‘సల్మాన్... సల్మాన్’ అంటూ నినాదాలు చేస్తూ లొకేషన్ మొత్తాన్నీ రచ్చ రచ్చ చేశారు. దాంతో, విదేశీయుల్లో కూడా తనకు ఇంతమంది అభిమానులున్నారా అని విస్తుపోవడం సల్మాన్ వంతు అయిందట.  వారిని కట్టడి చేయడం పోలండ్ పోలీసులకు పెద్ద సమస్యగా మారింది. మరి సల్లూభాయా మజాకా!