అమ్మ హ్యాండ్ నాకు కలిసొస్తుంది: ‘అల్లరి’ నరేష్

2 Jul, 2013 03:07 IST|Sakshi
అమ్మ హ్యాండ్ నాకు కలిసొస్తుంది: ‘అల్లరి’ నరేష్
 ‘‘ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఓ రియల్ హీరో ఉంటాడు. నాకు మా నాన్న రియల్ హీరో. ఇప్పుడు ఆయన లేరు. మా అమ్మ, మా అన్నయ్య ఈ వేడుకకు రావడం చాలా ఆనందంగా ఉంది. మా అమ్మ చేయి నాకు బాగా కలిసొస్తుంది. ఆమె చేతుల ద్వారా విడుదలైన ఈ ‘కెవ్వుకేక’ పాటలు పెద్ద హిట్ అవ్వడం ఖాయం’’ అని నమ్మకం వ్యక్తం చేశారు అల్లరి నరేష్. 
 
 ఆయన కథానాయకునిగా దేవిప్రసాద్ దర్శకత్వంలో బొప్పన చంద్రశేఖర్ నిర్మిస్తున్న చిత్రం ‘కెవ్వుకేక’. షర్మిలా మాండ్రే కథానాయిక. చిన్నిచరణ్, భీమ్స్ కలిసి సంగీతం అందించిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. అల్లరి నరేష్ తల్లిగారైన సరస్వతి ఆడియో సీడీని ఆవిష్కరించి ఆర్యన్ రాజేష్ దంపతులకు అందించారు.
 
  దేవిప్రసాద్ మాట్లాడుతూ -‘‘రెండు గంటలపాటు అందరినీ అలరించే సినిమా ఇది. అల్లరి నరేష్‌తో గతంలో  నేను చేసిన ‘బ్లేడ్‌బాబ్జీ’ చిత్రాన్ని మించేలా ఈ సినిమా ఉంటుంది. చిన్నిచరణ్, భీమ్స్ శ్రావ్యమైన స్వరాలందించారు’’ అని చెప్పారు. డా.డి.రామానాయుడు, బి.గోపాల్, శ్రీకాంత్, శ్రీహరి, పోసాని కృష్ణమురళి, భీమినేని శ్రీనివాసరావు, కె.ఎల్.దామోదరప్రసాద్, నాని, ఉదయ్‌కిరణ్, ఆది పినిశెట్టి, ప్రిన్స్, శశాంక్, శివబాలాజీ, షినా, మధుశాలిని తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.