ప్రత్యుషను పెళ్లి చేసుకోవాలనుకున్నా!

4 Apr, 2016 07:34 IST|Sakshi
ప్రత్యుషను పెళ్లి చేసుకోవాలనుకున్నా!

ప్రముఖ టీవీ నటి ప్రత్యుష బెనర్జీ అనుమానాస్పద మృతి వ్యవహారంలో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమె ప్రియడు రాహుల్‌ రాజ్ సింగ్ తాజాగా నోరువిప్పాడు. తాను అమాయకుడినని, ఈ వ్యవహారంలో తన తప్పు ఏమీ లేదని 'మిడ్‌ డే' పత్రికతో చెప్పాడు. ప్రత్యుష-తాను తరచూ గొడవలు పడిన విషయం వాస్తవమేనని అంగీకరించాడు.

నవంబర్‌ 2015 నుంచి తాను ప్రత్యుషతో డేటింగ్ చేస్తున్నానని, ఆమెను పెళ్లి కూడా చేసుకోవాలని భావించానని తెలిపాడు. ఆమెను ఎప్పుడూ తన భార్యగానే భావించినట్టు చెప్పాడు. ఆత్మహత్యకు ముందురోజు ప్రత్యుషతో తాను గొడవ పడ్డానని, ఆ రోజంతా తాను తాగుతూ గడిపిందని తెలిపాడు. పనిమీద తాను బయటకు వెళ్లి వచ్చేలోపు తాను ఉరేసుకొని కనిపించిందని, తను అలా చేసుకుంటుందని తెలిసి ఉంటే తాను ఇంటి నుంచి బయటకు వెళ్లేవాడిని కాదని చెప్పుకొచ్చాడు.

కాగా, రాహుల్‌ రాజ్ సింగ్ ఆదివారం ఆస్పత్రి పాలైన సంగతి తెలిసిందే. రాహుల్‌ తీవ్ర ఒత్తిడి, కుంగుబాటుతో సతమవుతున్నాడని, ఛాతినోప్పి రావడంతో అతన్ని ముంబైలోని ఓ ఆస్పత్రిలో చేర్చామని రాహుల్ తరఫు లాయర్‌ నీరజ్ గుప్తా తెలిపారు. రాహుల్‌ పోలీసు విచారణకు హాజరుకావాల్సి ఉంది. అయితే అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో చేరడంతో పోలీసు స్టేషన్‌కు వెళ్లలేదు.