పెళ్లికి తొందరేముంది

29 Sep, 2014 00:28 IST|Sakshi
పెళ్లికి తొందరేముంది

 పెళ్లికిప్పుడే తొందరేముంది తనకిప్పుడు యుక్త వయసే కదా అంటోంది అంజలి. సంచలనాలకు కేంద్ర బిందువుగా మారిన కొద్ది మంది హీరోయిన్లలో ఈ అమ్మడు ఒకరు. అంగాడి తెరు చిత్రంతో కోలీవుడ్‌లో కథానాయికగా గుర్తింపు పొందిన అంజలి అచ్చ తెలుగు అమ్మాయన్నది గమనార్హం. ఆ తరువాత వరుసగా ఎంగేయుం ఎప్పోదుం, కలగలప్పు వంటి చిత్రాల్లో నటించి సక్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా ముద్ర వేసుకున్నారు. సరిగ్గా అలాంటి సమయంలో తన పినతల్లి భారతీ దేవితో విభేదాలు, దర్శకుడు కలైంజియంతో వివాదాల కారణంగా కోలీవుడ్‌లో కలకలం పుట్టించారు.
 
 దీంతో కొంత కాలం కోలీవుడ్‌కు దూరమైన అంజలిపై పలు వదంతులు ప్రచారమయ్యాయి. అందులో ఒకటి అంజలి ఒక తెలుగు నిర్మాతను రహస్య వివాహం చేసుకున్నారన్నది. అయితే ఈ ప్రచారాన్ని అంజలి ఖండించారు. అయినా ఆమెపై పెళ్లి దుమారం ఆగలేదు. దీనికి తాజాగా స్పందించిన అంజలి తనకింకా యుక్తవయసే కదా పెళ్లకి తొందరేమీలేదు అన్నారు. పెళ్లికి చాలా సమయం ఉందన్నారు. ప్రస్తుతం తన దృష్టి అంతా నటనపైనేనని వెల్లడించారు. ఆమె సన్నిహితులు మాత్రం అంజలికి కోర్టులు, కేసులు అంటూ చాలా ఖర్చు అయ్యింది. అదంతా తిరిగి సంపాదించిన తరువాతనే వివాహం గురించి ఆలోచిస్తారని అంటున్నారు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తమిళంలో సురాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో జయం రవి సరసన నటిస్తున్నారు.