తొలిరోజే టాపు లేపిన బాహుబలి కలెక్షన్లు

11 Jul, 2015 14:16 IST|Sakshi
తొలిరోజే టాపు లేపిన బాహుబలి కలెక్షన్లు

ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా.. కలెక్షన్ వచ్చిందా లేదా. అదీ ఇప్పటి సినిమాల ట్రెండు దాదాపు రెండున్నరేళ్లుగా ఊరించి.. ఊరించి వచ్చిన బాహుబలి అనుకున్నట్లుగానే తెలుగు సినిమా రికార్డులను బద్దలుకొడుతోంది. వసూళ్లతో దూసుకెళ్లిపోతోంది. ఒక్క హైదరాబాద్లోనే సినిమా లిస్టింగ్స్ చూస్తే.. బాహుబలి కాకుండా మిగిలినవి మూడు నాలుగు సినిమాలే. అవి కూడా ఉన్నది రెండు మూడు థియేటర్లలోనే. ఈ రేంజిలో విడుదల చేసిన బాహుబలి... ఇండస్ట్రీ అంచనాలకు తగినట్లుగానే వసూళ్లు చేసింది. ఒక్క మొదటి రోజే తెలుగు వెర్షన్ ఒక్కటే 30.7 కోట్లు వసూలు చేసింది.

టాలీవుడ్ ఓపెనింగ్స్లో ఇప్పటివరకు ఏ సినిమా సాధించనంత స్థాయిలో తొలిరోజు కలెక్షన్లు రావడంతో.. ఇక తమిళ, హిందీ వెర్షన్లు కూడా కలిపితే ఇది 60 కోట్లు దాటింది. హిందీ వెర్షన్ థియేటర్ వసూళ్లు మొత్తం 7 కోట్లు రావొచ్చని తొలుత అంచనా వేయగా, మొదటిరోజే ఇది 5.15 కోట్ల రూపాయలు రాబట్టింది. దాంతో మొదటి వారాంతంలోనే ఇది 100కోట్ల మార్కును సులభంగా దాటేస్తుందని ట్రేడ్ అనలిస్టులు చెబుతున్నారు. అసలు బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ గురువారం రాత్రే హిందీ సినిమా ప్రివ్యూ చూసి.. ఇది బ్లాక్ బస్టర్ అవుతుందని, మాస్టర్ పీస్ అని ఆకాశానికి ఎత్తేశాడు. ఆ మాటలకు అర్థం ఏంటో ఇప్పుడు కలెక్షన్లను చూస్తుంటే తెలుస్తోంది.

శుక్రవారమే ఇలా ఉందంటే.. ఇక శని, ఆదివారాలు వీకెండ్ కలెక్షన్లు ఎంత వస్తాయో అంచనాలకు అందడం లేదు. సినిమా అన్ని వర్గాలకు చేరింది అనడానికి.. సెకండ్ షోలకు కూడా వృద్ధులు, గర్భిణీ స్త్రీలు రావడమే నిదర్శనం. కెరీర్లో ఇప్పటివరకు తీసిన 9 సినిమాలలో ఏ ఒక్కటీ ఫ్లాప్ అనే మాటే తెలియని ఎస్ఎస్ రాజమౌళి తీసిన పదో సినిమా ఎలా ఉంటుందో.. ఇంత అత్యంత భారీ బడ్జెట్ సినిమా కొన్నవాళ్లు మిగులుతారో.. లేదో అనే అనుమానాలు ఒక దశలో వచ్చిన మాట కూడా వాస్తవమే. కానీ.. టైటిల్తో పాటు అన్ని విషయాల్లోనూ అత్యంత భారీతనం కనిపించిన బాహుబలి సినిమా.... కలెక్షన్లను కూడా భారీగానే కొల్లగొట్టి సరికొత్త చరిత్ర సృష్టించింది. మూడు గంటల సినిమా.. ఎంతమంది చూస్తారులే అనుకున్నా, చూసిన ప్రతివాళ్లూ అప్పుడే అయిపోయిందా అంటున్నారంటే.. దర్శకుడు సక్సెస్ అయినట్లేనని విమర్శకులు చెబుతున్నారు. వీకెండ్ కూడా ముగిసిన తర్వాత కలెక్షన్లు ఎలా ఉన్నదీ సోమవారానికి తేలిపోతుంది.