'ఆ సీన్తో ప్రారంభించి కథ పూర్తి చేశా..'

21 Jul, 2015 12:57 IST|Sakshi
'ఆ సీన్తో ప్రారంభించి కథ పూర్తి చేశా..'

చెన్నై: బాహుబలి చిత్ర విజయం భారతీయ చిత్ర పరిశ్రమ అభివృద్ధికి నిదర్శనం అని ప్రముఖ కథా రచయిత, దర్శకుడు, ఎస్ఎస్ రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ అన్నారు. ఒక చిత్రాన్ని ఒక భాషకు, ఒక ఇండస్ట్రీకి పరిమితం చేయాల్సిన అవసరం లేదని బాహుబలి విజయం తర్వాత తనకు అనిపిస్తోందని చెప్పారు. దేశంలోని అన్ని భాషల్లో ఒక చిత్రాన్ని అనువాదం చేసి విడుదల చేయోచ్చని బాహుబలి నిరూపించిందని తెలిపారు. ఈ నెల 10న విడుదలైన ఈ చిత్రం పది రోజుల్లోనే రూ.350 కోట్లు వసూళ్లు చేసి భారతీయ చిత్ర పరిశ్రమలోని రికార్డులన్నీ తిరగరాసిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో విజయేంద్ర ప్రసాద్ ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఒక నదీ ప్రవాహం సీన్తో బాహుబలి కథ ప్రారంభించి పూర్తి చేశానని చెప్పారు. బాహుబలి ఇంతటి ఘన విజయం సాధిస్తుందని తాను ఊహించలేదని, ఈ సినిమా ప్రారంభించేముందు తన కుమారుడు ఎస్ఎస్ రాజమౌళికి కూడా అలాంటి ఆలోచన కలగలేదని అన్నారు. మహాభారతాన్ని తీయడానికి బాహుబలి ఒక నమునాలాంటిదని విజయేంద్ర ప్రసాద్ తెలిపారు. అలాగే, తాను అందించిన కథ ఆధారంగా విడుదలైన బాలీవుడ్ చిత్రం బజరంగీ బైజాన్ చిత్రం కూడా ఘన విజయం సాధించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.

తమ దేశంలో వైద్య ఖర్చు భరించలేక భారత్ వచ్చి తమ కూతురుకి గుండె ఆపరేషన్ చేయించుకున్న పాక్ దంపతుల గురించి తాను విన్నానని, ఆపరేషన్ పూర్తయ్యాక భారతీయుల గొప్పతనం గురించి వారు మాట్లాడలేకుండా ఉండిపోయారని, ఆ సందర్భం తనను ఎంతో ఆలోచింపజేసిందని వెంటనే కథరాయాలని ఆలోచించి బజరంగీ బైజాన్ కథ సిద్ధం చేశానని తెలిపారు. బాహుబలి చిత్రం విజయానికి ప్రేక్షకులే కారణమని చెప్పారు. వారు లేకుండా అసలు ఇంత విజయాన్ని ఊహించలేమని అన్నారు. ఒక చిత్ర భవిష్యత్తును తేల్చేది ప్రేక్షకులేనని విజయేంద్ర ప్రసాద్ అన్నారు.

>