ఇప్పట్లో పెళ్లి ఆలోచన లేదు: పునర్నవి

13 Oct, 2019 08:15 IST|Sakshi

మా మధ్య ఉన్నది కేవలం స్నేహమే..

నచ్చిన వ్యక్తి దొరికితే అమ్మానాన్నలకు చెబుతా

తల్లిదండ్రుల అభీష్టం ప్రకారమే నా వివాహం

టాప్‌–5లో శ్రీముఖి, వరుణ్, రాహుల్‌ ఉండొచ్చేమో 

వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ వస్తే మళ్లీ వెళ్దామనుకుంటున్నా

బిగ్‌బాస్‌– 3 కంటెస్టెంట్‌ పునర్నవి భూపాలం

‘రాహుల్‌ సిప్లిగంజ్‌ నాకు మంచి స్నేహితుడు. మా ఇద్దరిది స్వచ్ఛమైన స్నేహబంధం. నేను రాహుల్‌తో ప్రేమలో ఉన్నానని సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవం. మా గురించి బయట వేరేలా మాట్లాడుకోవడం చూసి చాలా బాధేసింద’ని చెప్పింది బిగ్‌బాస్‌–3 కంటెస్టెంట్‌ పునర్నవి భూపాలం. బిగ్‌బాస్‌ హౌస్‌ నుంచి బయటకొచ్చిన పునర్నవి శనివారం ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడింది. ఈ రెండున్నర నెలలు కుటుంబం, స్నేహితులను బాగా మిస్‌ అయ్యానని తెలిపింది. వైల్డ్‌కార్డు ఎంట్రీ అవకాశం వస్తే మాత్రం మళ్లీ ఆనందంగా వెళ్తానని పేర్కొంది. ఒకవేళ హౌస్‌లో ఉండి ఉంటే తప్పకుండా విన్నర్‌ అయ్యేదాన్నని ఆశాభావం వ్యక్తం చేసింది. ఇప్పట్లో పెళ్లి ఆలోచన లేదంది. ఆమె పంచుకున్న మరిన్ని విశేషాలు..

పదకొండు వారాలు.. పరిచయం లేని ముఖాల మధ్య ఉండటం.. ఫోన్‌ లేదు.. పుస్తకాల్లేవ్‌.. టీవీ లేదు.. కుటుంబ సభ్యులను కలవడానికి వీల్లేదు.. బిగ్‌బాస్‌–3 హౌస్‌లో ముక్కుసూటిగా మాట్లాడే మనస్తత్వమున్న ఆమె రెండున్నర నెలల పాటు తన హావభావాలు, అందచందాలు, మాటతీరు, ఆటపాటలతో వీక్షకులను కట్టిపడేసింది. బిగ్‌బాస్‌ టాప్‌–5లో నిలుస్తానని భావించింది. ఓట్లు రాకపోవడమో, మాటతీరో, ముక్కుసూటితనమో తెలియదు గానీ మూడు వారాల ముందే ఎలిమినేట్‌ అయ్యింది. వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ వస్తే మాత్రం మళ్లీ వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెబుతోంది బిగ్‌బాస్‌– 3 కంటెస్టెంట్‌ పునర్నవి భూపాలం. ఆమె ఇటీవల హౌస్‌ నుంచి బయటికి వచ్చేసింది. బిగ్‌బాస్‌ హౌస్‌లో తన అనుభవాలు.. తోటి కంటెస్టెంట్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌తో స్నేహం తదితర అంశాలను  ‘సాక్షి’తో పంచుకుంది. అవి ఆమె మాటల్లోనే..  
- పురుమాండ్ల నరసింహారెడ్డి

కుటుంబాన్ని మిస్సయ్యా..
రెండున్నర నెలలపాటు నా కుటుంబాన్ని, స్నేహితుల్ని బాగా మిస్సయ్యా. వచ్చేశావా అంటూ ఆనందంగా అంతా ఆలింగనం చేసుకున్నారు. నువ్వుండాల్సిన స్ట్రాంగ్‌ కంటెస్టెంట్‌వని అన్నారు. వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ ఉండదేమోనని అనుకుంటున్నాను. ఉంటే మాత్రం ఆనందంగా వెళ్తాను. మూడు వారాల్లో ముగిసే సమయంలో ఎంట్రీ వస్తే నేను వెళితే మిత్రులు హ్యాపీగా ఫీలవుతారు.

టైటిల్‌ విన్నర్‌ అయ్యేదాన్నేమో..
అలాగే ఉండి ఉంటే టైటిల్‌ విన్నర్‌ అయ్యేదాన్నేమో. టాప్‌– 5లో మాత్రం ఉండేదాన్నని అనుకుంటున్నా. ఇదొక జీవితానుభవం. 11 వారాలు 23 ఏళ్ల వయసులో అంతమంది మైండ్‌సెట్‌తో కలిసి ఉండటం గొప్ప విషయమే. వరుణ్, వితిక నామినేట్‌ చేసినప్పుడు కూడా నవ్వుతూనే ఉన్నాను. నామినేట్‌ చేసినా సరే నాకు కోపం రాలేదు. ఇప్పటికీ వారిద్దరిపై స్నేహభావమే ఉంది. ఎలిమినేట్‌ అయ్యేదాకా ఆ ముగ్గురితో స్నేహం బలంగా ఉండేది. నా కోసం రాహుల్‌ త్యాగం చేయడం బాధ కలిగించింది.

ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నా..
రెండున్నర నెలల బిగ్‌బాస్‌ షోలో ఉండటం ఓ చాలెంజ్‌. బయటికి రాగానే ముందుగా డేట్‌.. ఆ రోజు ఏమిటని అడిగా. ఫోన్‌ చూడగానే పాస్‌వర్డ్‌ మరిచిపోయా. ఆ తర్వాత మెసేజ్‌లు చూశా. చాలా మెసేజ్‌లు వచ్చాయి. బయటికి రాగానే ముందుగా డేట్‌ అండ్‌ టైమ్‌ అడిగాను. నా బాడీ, మైండ్‌ చెక్‌ చేసుకున్నా. ఇన్‌స్ట్రాగామ్‌లో చాలా సపోర్ట్‌ వచ్చింది.  వరుణ్, వితిక, రాహుల్, నేను మంచి స్నేహితులం. బిగ్‌బాగ్‌ హౌస్‌లోకి వెళ్లాక మూడు వారాలు చాలా ఇబ్బందిపడ్డాను. రిజర్వ్‌గా ఉండేదాన్ని. మెల్లమెల్లగా ఆత్మవిశ్వాసం పెరిగింది. నా మైండ్‌సెట్‌కు తగినట్లుగా ప్రవర్తించడం మొదలెట్టాను. అందరితో సన్నిహితంగా మెలిగాను. ఒక కుటుంబంగా భావించి అందరితో సంబంధ బాంధవ్యాలను మెరుగుపరుచుకున్నాను. అందులో ఈ ముగ్గురితో బాగా అనుబంధం ఏర్పడింది. అందులో పుస్తకాలు ఉండవు. ఫోన్లు ఉండవు. టీవీ ఉండదు. పత్రికలు ఉండవు. ఉండేదల్లా కథలు చెప్పుకోవడం, టాస్క్‌ల గురించి ఆలోచించడం. తప్పితే ఇంకో వ్యాపకం ఉండేది కాదు. చాలా ఎడిట్‌ చేసి గంట మాత్రమే ప్రసారం చేస్తారు.  

ఆ ముగ్గురు టాప్‌– 5లో ఉంటారు..  
బిగ్‌బాస్‌– 3 టాప్‌– 5లో రాహుల్‌తో పాటు వరుణ్, శ్రీముఖి ఉంటారనుకుంటున్నాను. ఎందుకంటే ఈ ముగ్గురు హౌస్‌లో ప్రవర్తించిన తీరు, వారి హావభావాలు, కదలికల్ని దగ్గర్నుంచి చూశాను.  

ప్రస్తుతం చదువు, సినిమాలే..  
నేను తెనాలిలో పుట్టి పెరిగాను. హైదరాబాద్‌లో చదువు పూర్తి చేశాను. విల్లామేరీ కాలేజీలో  సైకాలజీ, జర్నలిజం చేశా. చదువులో ఉండగానే ‘ఉయ్యాల..జంపాల’ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. అక్కడి నుంచి నా సినిమా జర్నీ మొదలైంది. అమెరికాలో మా అక్క వద్ద ఉన్నప్పుడే బిగ్‌బాస్‌ సీజన్‌– 2లో అవకాశం వచ్చినా కుదరలేదు. ఆ తర్వాత బిగ్‌బాస్‌– 3లో అవకాశం వచ్చింది. ఇప్పుడు నా దృష్టంతా చదువు, సినిమాలపైనే. పెళ్లి ఆలోచన లేదు. ఒకవేళ నాకు నచ్చిన వ్యక్తి దొరికితే తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లి వారిని ఒప్పించి చేసుకుంటా. వారు వద్దంటే ఊరుకుంటా. వారు చూసిన సంబంధం కూడా ఇష్టమే. అయితే పెళ్లికి మరో ఐదారేళ్ల సమయముంది.  

అవకాశాలు వస్తున్నాయి..
ప్రస్తుతం సైకిల్, చిన్న విరామం సినిమాల్లో నటిస్తున్నాను. అర్జున్‌రెడ్డి డైరెక్టర్‌తో ఓ సినిమా అవకాశం వచ్చింది. కథలు వింటున్నాను. ప్రస్తుతం యాక్టింగ్, చదువుపైనే దృష్టి కేంద్రీకరించా.  

మరిన్ని వార్తలు