నాగచైతన్య, హన్సిక జంటగా శ్రీనివాసరెడ్డి సినిమా

31 Jul, 2013 01:31 IST|Sakshi
నాగచైతన్య, హన్సిక జంటగా శ్రీనివాసరెడ్డి సినిమా
 ‘నాగార్జున జీవితంలోనే మరపురాని చిత్రమైన ‘హలోబ్రదర్’ పునర్నిర్మాణం కాబోతోంది. నాగచైతన్య ఇందులో కథానాయకునిగా నటిస్తారు. నాగ్‌తో ‘డమరుకం’ లాంటి ఫాంటసీ ఎంటర్‌టైనర్‌ని తెరకెక్కించిన శ్రీనివాసరెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారు’.. గత కొన్ని రోజులుగా వినిపిస్తున్న ఊహాగానాలివి. వీటి తాకిడికి అటు ప్రేక్షకుల్లో, ఇటు పరిశ్రమలో రకరకాల సందేహాలు
 
 . ‘హలోబ్రదర్’లో నాగ్ పోషించిన దేవా, రవివర్మ పాత్రలకు నాగచైతన్య న్యాయం చేయగలడా? ఈవీవీ అనితరసాధ్యంగా తెరకెక్కించిన ఈ చిత్రాన్ని శ్రీనివాసరెడ్డి యాజిటీజ్‌గా తీస్తాడా? లేక ఏమైనా మార్పులు చేస్తాడా?... అని. వీటన్నింటికీ తెర దించుతూ... ఎట్టకేలకు నాగచైతన్య, శ్రీనివాసరెడ్డిల చిత్రం ప్రకటన వెలువడింది. వీరిద్దరి కాంబినేషన్‌లో రూపొందే సినిమా ‘హలోబ్రదర్’ రీమేక్ కాదు. ఆకుల శివ తయారు చేసిన ఓ మాస్ కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు శ్రీనివాసరెడ్డి.
 
  సి.కల్యాణ్ ఈ చిత్రానికి సమర్పకుడు. వరుణ్, తేజ నిర్మాతలు. హన్సిక కథానాయికగా నటించనున్న ఈ చిత్రం గురించి సి.కల్యాణ్ చెబుతూ -‘‘మాస్ అంశాల మేళవింపుగా ఓ అద్భుతమైన కథను ఆకుల శివ తయారు చేశారు. ఈ కథకు శ్రీనివాసరెడ్డి తప్పక న్యాయం చేకూరుస్తాడని నా నమ్మకం. నాగచైతన్య కెరీర్‌లో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచే సినిమా అవుతుంది.
 
  కథలో కీలకమైన పాత్రను బ్రహ్మానందం పోషించనున్నారు. సెప్టెంబర్‌లో ఈ చిత్రాన్ని ప్రారంభిస్తాం. అక్టోబర్, నవంబర్, డిసెంబర్‌ల్లో జరిగే షెడ్యూల్స్‌తో ఈ చిత్రం పూర్తవుతుంది’’ అని తెలిపారు. ఈ చిత్రానికి కథ, మాటలు: ఆకుల శివ, సంగీతం: అనూప్ రూబెన్స్, నిర్మాణం: శ్రీశుభశ్వేత ఫిలింస్.