తగ్గిన అవకాశాలు.. ఫొటోషూట్‌లతో హల్‌చల్‌!

10 Nov, 2019 09:25 IST|Sakshi

తమిళసినిమా : నటి కేథరిన్‌ ట్రెసా అవకాశాల కోసం ముమ్మరంగా ప్రయత్నిస్తోంది. నిజం చెప్పాలంటే ఈ అమ్మడిని సినీ ఇండస్ట్రి పట్టించుకోవడం లేదనే చెప్పాలి. కారణం ఏమిటో తెలియడంలేదు. దుబాయ్‌లో పుట్టి పెరిగిన భారతీయ సంతతికి చెందిన నటి కేథరిన్‌. అయితే తన ఉన్నత చదువును బెంగళూర్‌లోనే చదివింది. ఈ బ్యూటీకి సంగీతంలో కూడా ప్రవేశం ఉంది. వయోలిన్‌ వాయించడం, పాటలు పాడడం వంటి కళల్లో నేర్పరి అయిన కేథరిన్‌ ట్రెసా మొదట్లో మోడలింగ్‌ రంగంలో రాణించింది. ఆ తరువాత నటిగా సినీరంగప్రవేశం చేసింది. తొలుత కన్నడంలో శంకర్‌ ఐపీఎస్‌ అనే చిత్రంతో నటిగా తన పయనాన్ని ప్రారంభించింది. అది 2010లో తెరపైకి వచ్చింది. అ తరువాత మలయాళం, తెలుగు, తమిళం భాషల్లో అవకాశాలను అందుకుంది. ఇలా బహుభాషా నటిగా పేరు తెచ్చుకోవడంతో పాటు సక్సెస్‌ను అందుకుంది. కోలీవుడ్‌లో మెడ్రాస్‌ చిత్రం ద్వారా కార్తీకి జంటగా  దర్శకుడు పా.రంజిత్‌ పరిచయం చేశారు. ఆ చిత్రం మంచి విజయం సాధించడంతో పాటు కేథరిన్‌ట్రెసాకు పేరు తెచ్చి పెట్టింది.

మోడలింగ్‌ రంగం నుంచి వచ్చిన ఈ అమ్మడిని మెడ్రాస్‌ చిత్రంలో పక్కింటి అమ్మాయిగా చూపించి దర్శకుడు కేథరిన్‌ ట్రెసా రూపురేఖలను మార్చేశారు. ఆ తరువాత ఈ జాణ గ్లామర్‌కు మారిపోయింది. అలా విశాల్, అధర్వ, ఆర్య వంటి యువ స్టార్స్‌తో వరుసగా నటించి గుర్తింపు పొందిన కేథరిన్‌ ట్రెసాకు సడన్‌గా కోలీవుడ్‌లో అవకాశాలు తగ్గిపోయాయి. అందంతో పాటు మంచి ట్యాలంట్‌ ఉన్న ఈ అమ్మడికి కారణాలేమైనా ఇతర భాషల్లోనూ అవకాశాలు తగ్గిపోయాయి. చివరిగా ఈ బ్యూటీ తమిళంలో శింబుకు జంటగా వందా రాజావాదాన్‌ వరువేన్‌ చిత్రంలో మెరిసింది. ప్రస్తుతం అరువమ్‌ అనే ఒకే ఒక్క చిత్రం చేతిలో ఉంది. అయితే తొలి చిత్రం మెడ్రాస్‌ తరువాత కోలీవుడ్‌లో కేథరిన్‌ ట్రెసాకు నటనకు అవకాశం ఉన్న పాత్రలు లభించలేదనే చెప్పాలి. అన్నీ గ్లామరస్‌ పాత్రలే రావడంతో వాటికే పరిమితం అయిపోయింది. ఇప్పుటికీ అందాలారబోతకు సై అంటోంది. నటిగా దశాబ్దం పూర్తి కావస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో సెకండ్‌ ఇన్నింగ్స్‌ కోసం రెడీ అయ్యింది. అవకాశాల వేట మొదలెట్టింది. అందులో భాగంగా గ్లామరస్‌ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేసింది. ఈ సందర్భంగా  మెడ్రాస్‌ చిత్రం తరహాలో నటనకు అవకాశం ఉన్న పాత్రలో తనను చూడాలని అభిమానులు కోరుకుంటున్నారని, అయితే అలాంటి పాత్రలను తానూ ఆశిస్తున్నా, గ్లామర్‌ పాత్రలను వదులుకోనని కేథరిన్‌ ట్రెసా పేర్కొంది. కాగా ఈ అమ్మడు పోస్ట్‌ చేసిన గ్లామరస్‌ ఫొటోలిప్పుడు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తున్నాయి. అయితే ఇవి అవకాశాలను ఏపాటి తెచ్చి పెడతాయన్నదే చూడాలి. ఎందుకంటే తమిళసినిమా కేథరిన్‌ ట్రెసాను పక్కన పెట్టేసిందనే చెప్పాలి.


మరిన్ని వార్తలు