రాజకీయాలపై అప్పుడే ఆశ కలిగింది..!

10 Nov, 2019 09:38 IST|Sakshi
కమల్‌ హాసన్‌, శ్రుతి హాసన్‌

పెరంబూరు : రాజకీయాలపై అప్పుడే ఆశ కలిగిందని నటుడు, మక్కళ్‌ నీది మయ్యం పార్టీ అధక్షుడు కమలహాసన్‌ పేర్కొన్నారు. ఈయన తన పుట్టిన రోజు సందర్భంగా గురువారం సొంత ఊరు పరమకుడిలో తండ్రి శ్రీనివాసన్‌ శిలావిగ్రహాన్ని ఆవిష్కరించారు. శుక్రవారం చెన్నైలోని తన పార్టీ కార్యాలయంలో సీనీ పితామహుడు కే.బాలచంద్రర్‌ శిలావిగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అదే రోజు సాయంత్రం గాంధీజీ 150 జయంతిని పురష్కరించుకుని కమల్‌ నటించిన హేరామ్‌ చిత్రాన్ని రాయపేటలోని సత్యం థియేటర్‌లో ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ చిత్రాన్ని పలువురు సినీ ప్రముఖులు వీక్షించారు. అనంతరం కమలహాసన్‌ మీడియాతో మాట్లాడారు. వ్యాపారాన్ని మించి తన జీవిత లక్ష్యం ఏమిటన్నది తాను తెలుసుకుంది హేరామ్‌ చిత్ర నిర్మాణ సమయలోనేనని, రాజకీయాల్లోకి రావాలన్న అప్పుడే అనుకున్నానని, అప్పుడే తన జీవితబాటకు నాంది పడిందన్నారు. ఆ చిత్రాన్ని రూపొందించిన తాను ఇంతకుమునుపే ఈ స్థానానికి వచ్చి ఉండాల్సిందన్నారు. ఆలస్యానికి చింతిస్తున్నానని, అందుకు క్షమాపణలు కోరవచ్చుననన్నారు.

అయితే హేరామ్‌ చిత్రం మాత్రం ఆలస్యంగా రాకూడదన్నారు. నిజానికి 2010లో తెరపైకి రావడమే ఆలస్యం అని పేర్కొన్నారు. ఆ చిత్రాన్ని పూర్తి చేయడం గర్వం కన్నా బా«ధ్యతగా భావించానన్నారు. హేరామ్‌ చిత్రం చేసేటప్పుడు తనకు రాజయకీయ ఆలోచన లేదన్నారు. ఆ చిత్రం చూసిన తరువాత రాజకీయ ఆశ కలిగిందని చెప్పారు. ఆశకు, వ్యాపారానికి మధ్య చాలా తారతమ్యం ఉందన్నారు. హేరామ్‌ ఆశతోచేశానని, వ్యాపార దృష్టితో చేసుంటే ఈ పాటికి అలాంటివి 50 చిత్రాలు చేసేవాడినని అన్నారు. ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా ముందు ఇళయరాజాను వద్దనుకున్నామన్నారు. వేరే కొందరిని సంప్రదించామని తెలిపారు. ఇది గాంధీజీ ఇతివృత్తంతో చేసే చిత్రానికి సత్యాగ్రహం చేయాలని భావించి మళ్లీ ఇళయరాజానే ఎంపిక చేశామన్నారు. ఆయన కూడా వినయంగా అంగీకరించారని చెప్పారు. ఇకపోతే గాంధీజీని పటేల్‌ను పోల్చి చూడరాదని, వారిద్దరూ ఎవరికి వారే గొప్పవారని పేర్కొన్నారు. నేటి పరిస్థితుల్లో తరాసుకు ముల్లే లేకుండా పోయ్యిందని కమలహాసన్‌ వ్యాఖ్యానించారు.

నాన్న విల్‌ పవర్‌ సూపర్‌
కమలహాసన్‌తో పాటు ఆయన కూతురు, నటి శ్రుతీహాసన్‌ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ నాన్న నటుడిగా, రాజకీయనాయకుడిగా ప్రజలందరికీ కనెక్ట్‌ అయ్యారని అన్నారు. ఆయన మనసులో కలిగిన దాన్ని తెలివితో చేస్తారని, చిన్న వయసులో తమను గారాబం చేసేవారు కాదన్నారు. పెద్దవారిలా అభిప్రాయాలను తెలుసుకునేవారని వివరించారు. తాము చెప్పింది సరి కాకపోతే వివరించి చెప్పేవారని తెలిపారు. ఇంటికి ఒక్కో రోజు లేడీ గెటప్‌లోనూ, పులి వేషంలోనూ, ఇండియన్‌ తాతా గెటప్‌ ఇలా పలు వేషాలతో వచ్చేవారని చెప్పారు. అలా ఆయన రావడాన్ని ఆశ్చర్యంగా చూసేవారమని, ఒక రోజు కలైంజర్‌ చిత్ర షూటింగ్‌లో పెద్ద యాక్సిడెంట్‌కు గురయ్యారని తెలిపారు. స్కూల్‌ నుంచి తీసుకొచ్చిన నాన్న మేనేజర్‌ తనకా విషయాన్ని చెప్పడంతో చాలా భయపడ్డానని వివరించారు. ఆస్పత్రిలో స్పృహలేకుండా ఉన్న నాన్న తిరిగి వస్తే సూపర్‌ హీరోనేనని భావించానని, అలాగే ఆయన వీరత్వంతో తిరిగొచ్చారని చెప్పారు. ఆయనకు ఉన్న విల్‌ పవర్‌ను తాను మరెవరిలోనూ చూడలేదని శ్రుతీహాసన్‌ పేర్కొన్నారు.   

మరిన్ని వార్తలు