793 చిత్రాలపై నిషేధం విధించిన సెన్సార్‌ బోర్డ్‌

20 Feb, 2019 10:56 IST|Sakshi

16 ఏళ్లలో 793 సినిమాలపై నిషేధం విధించిన సీబీఎఫ్‌సీ

జాబితాలో 53 తెలుగు చిత్రాలు

2015-16లో అత్యధికంగా 152 చిత్రాల ప్రదర్శనకు అనుమతి నిరాకరణ

లక్నో: గత 16 ఏళ్లలో 793 సినిమాలపై నిషేధం విధించినట్టు సెంట్రల్‌ బోర్ట్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ సర్టిఫికేషన్‌(సీబీఎఫ్‌సీ) తెలిపింది. లక్నోకు చెందిన ఆర్టీఐ కార్యకర్త నూతన్‌ ఠాకూర్‌ దాఖలు చేసిన ఆర్జీపై సెన్సార్‌ బోర్డ్‌ ఈ సమాచారం అందజేసింది. దీనిపై నూతన్‌ ఓ వార్తసంస్థతో మాట్లాడుతూ.. 2000 జనవరి 1 నుంచి 2016 మార్చి 31 వరకు సెన్సార్‌ బోర్డ్‌ 793 సినిమాల ప్రదర్శనకు అనుమతి నిరాకరించదని తెలిపారు. అందులో 586 భారతీయ చిత్రాలు కాగా, 207 విదేశీ చిత్రాలు ఉన్నాయని అన్నారు. 

ఈ కాలంలో 231 హిందీ, 96 తమిళ్‌, 53 తెలుగు, 39 కన్నడ, 23 మళయాళ, 17 పంజాబీ, 12 బెంగాలీ, 12 మరాఠి చిత్రాలు సెన్సార్‌ బోర్డ్‌ నిషేధానికి గురయ్యాయి. అత్యధికంగా 2015-16 ఏడాదికి గానూ 152 చిత్రాల ప్రదర్శనకు సెన్సార్‌ బోర్డ్‌ అనుమతి నిరాకరించింది. సెన్సార్‌ బోర్డు అనుమతి నిరాకరించినవాటిలో అశ్లీలత, నేర ప్రవృత్తి, వివాదాస్పద కథాంశాలు కలిగిన చిత్రాలు ఉన్నాయి.  ప్రముఖ బాలీవుడ్‌ నటుడు సన్నీడియోల్‌ నటించిన మోహల్లా అస్సీ చిత్రంలో మత భావాలను దెబ్బతీసే విధంగా ఉందని ఫిర్యాదులు రావడంతో సెన్సార్‌ బోర్ట్‌ ఈ చిత్రాన్ని 2015లో నిషేధించింది. ఆ తర్వాత జరిగిన పరిణామాల అనంతరం ఈ చిత్రం 2018 నవంబర్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

మరిన్ని వార్తలు