వేటూరి ప్రోత్సాహం వల్లే ఈ స్థాయికి

30 Jan, 2018 02:11 IST|Sakshi

వేటూరి సాహితీ పురస్కార గ్రహీత చంద్రబోస్‌ 

తునిలో పురస్కారం ప్రదానం 

సాక్షి, పాయకరావుపేట (విశాఖ జిల్లా): ఊపిరి ఉన్నంత వరకు తన జీవితం సినీపరిశ్రమకే అంకితమని ప్రముఖ సినీగేయ రచయిత చంద్రబోస్‌ అన్నారు. వేటూరి సాహితీ పీఠం, శ్రీ ప్రకాష్‌ కల్చరల్‌ అసోసియేషన్‌ సంయుక్తంగా చంద్రబోస్‌కు వేటూరి అష్టమ సాహితీ పురస్కారాన్ని సోమవారం ప్రదానం చేశాయి. తుని చిట్టూరి మెట్రోలో జరిగిన కార్యక్రమంలో సాహితీ పీఠం వ్యవస్థాపక గౌరవ అధ్యక్షుడు చక్కా సూర్యనారాయణ, అధ్యక్షుడు సీహెచ్‌వీకే నరసింహారావు, వ్యవస్థాపక కార్యదర్శి కలగా జోగేశ్వరశర్మ, ప్రకాష్‌ కల్చరల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు సీహెచ్‌ విజయ్‌ప్రకాష్‌లు ఈ పురస్కారాన్ని చంద్రబోస్‌కు ప్రదానం చేశారు.

చంద్రబోస్‌కు పురస్కారంతో పాటు, 120 సాహితీ పుస్తకాలతో తుని, పాయకరావుపేట పట్టణాలకు చెందిన ప్రముఖులు సన్మానించారు. ఈ సందర్భంగా చంద్రబోస్‌ మాట్లాడుతూ.. వేటూరి ప్రోత్సాహం వల్లే తాను ఈ స్థాయికి ఎదిగానని చెప్పారు. ఆయన పేరుతో ఏర్పాటు చేసిన పురస్కారాన్ని తనకు అందజేయడం ఆనందంగా ఉందన్నారు. నేటి యువతకు గాయకులుగా, గేయ రచయితలుగా రాణించడానికి ఎన్నో అవకాశాలున్నాయని మాతృభాషపై పూర్తి పరిజ్ఞానాన్ని సంపాదించుకోవాలని సూచించారు. వేటూరిని పూజించడమంటే అక్షరాన్ని పూజించడమేనని అన్నారు. శ్రీ ప్రకాష్‌ విద్యాసంస్థలు చేస్తున్న కార్యక్రమాలు అభినందనీయమన్నారు. కార్యక్రమంలో పాయకరావుపేట ఎమ్మెల్యే అనిత, తుని మార్కెట్‌ యార్డు చైర్మన్‌ యనమల కృష్ణుడు, టాలీవుడ్‌ చానల్‌ సీఈవో శర్మ పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు