విద్యతో ఆలోచనల్లో మార్పు

14 Feb, 2014 00:37 IST|Sakshi
విద్యతో ఆలోచనల్లో మార్పు
విద్యతోనే మనుషుల ఆలోచనా విధానంలో మార్పు సంభవమని నటి కిరణ్ ఖేర్ అన్నారు. ఆమె గురువారం పంచాయత్ ఆజ్ తక్ నిర్వహించిన ‘ఓట్ లో.. సురక్షా దో..’ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, అకృత్యాలను నిరోధించాలంటే ముందు స్త్రీ,పురుషుల్లో విద్య పట్ల ఆసక్తిని పెంచాలన్నారు. చదువుకున్న వారి ఆలోచనలు సరైన రీతిలో ఉంటాయి. అదే విపరీత మానసిక ప్రవృత్తి ఉన్న వ్యక్తుల  మెదడు సక్రమ మార్గంలో ఆలోచించలేదు.. అలాంటి వారిని విద్యావంతులను చేస్తే సరైన మార్గంలో నడిచే అవకాశముంది..’ అని ఆమె సూచించారు. ‘భారతదేశం చాలా సువిశాలమైంది.. ఇక్కడ కొన్ని ప్రాంతాల్లో ప్రేమికుల రోజును జరుపుకోవడాన్ని స్వాగతిస్తారు.. కొన్ని ప్రాంతాల్లో తప్పుగా చూస్తారు.. అది ఆయా ప్రాంతాల ప్రజల ఆలోచనాసరళిని బట్టి ఉంటుంది.. విద్యతో అటువంటి వారి ఆలోచనాసరళిని మార్చవచ్చు’నని ఆమె అభిప్రాయపడ్డారు. మహిళలపై హింసను అరికట్టాలంటే చట్టాలను చాలా కఠినంగా అమలు చేయాలని, దానికి చాలా బలమైన నాయకత్వం అవసరమని బీజేపీ నేత అయిన ఈ 58 ఏళ్ల  బాలీవుడ్ సినీనటి స్పష్టం చేశారు.
 
 
>