‘మా’లో రచ్చ.. రాజశేఖర్‌పై చిరంజీవి ఆగ్రహం

2 Jan, 2020 13:03 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (మా)లో అభిప్రాయబేధాలు మరోసారి బయటపడ్డాయి. గురువారం హైదరాబాద్‌లో జరిగిన ‘మా’ డైరీ అవిష్కరణ కార్యక్రమంలో గందరగోళం చోటుచేసుకుంది. రాజశేఖర్‌ ప్రవర్తనపై చిరంజీవి, మోహన్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో పరుచూరి గోపాలకృష్ణ చేతిలో నుంచి రాజశేఖర్‌ మైకు లాక్కోవడంతో వివాదం తలెత్తింది. చిరంజీవి వ్యాఖ్యలపై రాజశేఖర్ అభ్యంతరం తెలిపారు. మొదటగా సభలో మాట్లాడిన చిరంజీవి.. ‘మా’లో మంచి ఉంటే మైక్‌లో చెబుదాం.. చెడు ఉంటే చెవులో చెబుదాం అని సముదాయించే ధోరణిలో చెప్పారు. చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఉన్నా అందరూ కలిసి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. చిరంజీవి వ్యాఖ్యలపై నిరసనగా రాజశేఖర్ వేదికపైకి వచ్చి అక్కడ ఉన్నవారి కాళ్లకు నమస్కారం చేస్తూ.. ఆ సమయంలో మాట్లాడుతున్న పరుచూరి నుంచి మైకు లాక్కున్నారు. చిరంజీవి చెప్పిన అంశాలను తప్పుబట్టారు. చెప్పేది ఒకటి.. చేసేది మరోకటి అంటూ సినీ పెద్దలపై రాజశేఖర్‌ రుసరుసలాడారు. ఇండస్ట్రీలో అగ్గి రాజేసుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే తన కారు ప్రమాదానికి ‘మా’ పరిస్థితే కారణమని ఆరోపించారు. 

దీనిపై స్పందించిన చిరంజీవి.. ఆయన చెప్పిన మాటలకు విలువెక్కడుందని రాజశేఖర్ ను ఉద్దేశించి ప్రశ్నించారు. రాజశేఖర్ ప్రవర్తనను తప్పుబడుతూ, ఇది మంచి పద్దతి కాదని హితవు పలికారు. అదే సమయంలో వేదిక దిగి వెళ్లిపోయిన రాజశేఖర్‌.. మళ్లీ వచ్చి ‘మా’ పై తాను మాట్లాడింది అంతా నిజమేనని గట్టిగా మాట్లాడారు. దాంతో ఆగ్రహం వ్యక్తం చేసిన చిరంజీవి.. రాజశేఖర్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు. రాజశేఖర్‌ పథకం ప్రకారమే ఈ కార్యక్రమాన్ని రసాభాస సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. అనంతరం రాజశేఖర్‌ అక్కడి నుంచి వెళ్లిపోయారు.

ఆ తర్వాత మాట్లాడిన చిరంజీవి.. సినీ పరిశ్రమ అభివృద్ధికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, కేసీఆర్‌లు హామీ ఇచ్చారని తెలిపారు. సినీ పరిశ్రమ అభివృద్దికి సరైన ప్రణాళికతో ముఖ్యమంత్రులను కలుద్దామని చెప్పారు.
అంతకుముందు ‘మా’  నూతన డైరీ ఆవిష్కరణ కార్యక్రమం గురువారం హైదరాబాద్‌లో జరిగింది. మా డైరీ-2020’ తొలి ప్ర‌తిని ఆవిష్క‌రించి రెబ‌ల్ స్టార్ కృష్ణంరాజుకు అందించారు. ఈ కార్యక్రమంలో మెగాస్టార్‌ చిరంజీవి, మోహన్‌బాబు, రాజ్యసభ సభ్యులు సుబ్బరామిరెడ్డి, పరుచూరి బ్రదర్స్‌, జీవిత, రాజశేఖర్‌ దంపతులు, నరేష్‌, రాజా రవీంద్ర, జయసుధ, హేమ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. ‘తెలుగు సినీ పరిశ్రమకు చెందిన అందరి అడ్రస్‌లు డైరీలో ఉన్నాయి. పేద కళాకారులకు సహాయ, సహకారాలు అందించాలి. అందుకోసం అందరు అగ్ర హీరోలను కలుస్తా’ అని తెలిపారు.

మా అధ్యక్షుడు నరేశ్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రెసిడెంట్‌ రాజశేఖర్‌ల మధ్య కొద్దికాలంగా వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కానీ ఈ రోజు జరిగిన కార్యక్రమంలో సినీ పెద్దల సమక్షంలో మూవీ అసోసియే‍న్‌లో భేదాభిప్రాయాలు తీవ్ర స్థాయిలో రచ్చకెక్కడం చర్చనీయాంశంగా మారింది. రాజశేఖర్‌ మాట్లాడిన అంశాలపై కాకుండా.. ఆయన ప్రవర్తించిన విధానంపై చాలా మంది ఖండిస్తున్నారు. సినీ పెద్దలపై రాజశేఖర్‌ నేరుగా కామెంట్లు చేయడం ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుందో వేచిచూడాలి.

>
మరిన్ని వార్తలు