తండ్రి కాబోతున్న చిరంజీవి సర్జా.. అంతలోనే

9 Jun, 2020 15:34 IST|Sakshi

కన్నడ చిత్ర హీరో చిరంజీవి సర్జా (39) గుండెపోటుతో ఆదివారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన మరణం అభిమానులను ఎంతో కలచి వేస్తోంది. ఈ విషాద సమయంలో మరో వార్త తెలిసింది. చిరంజీవి సర్జాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చే ఈ వార్త.. ప్రస్తుతం మరింత విషాదాన్ని పంచుతుంది. చిరంజీవి భార్య గర్భవతి. త్వరలోనే వారి కుటుంబంలోకి మరో చిన్ని అతిథి రాబోతున్నారు. పుట్టబోయే బిడ్డ కోసం చిరంజీవి దంపతులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారని సన్నిహితులు తెలిపారు. అంతేకాక త్వరలోనే ఈ శుభవార్తను అభిమానులతో పంచుకోవాలని చిరంజీవి దంపతులు అనుకున్నట్లు సమాచారం. కానీ ఈ కోరికలేవి తీరకుండానే చిరంజీవి ఆకస్మికంగా మృతి చెందారు. బిడ్డ పుట్టబోతుందన్న వార్త తెలిసి అభిమానులు, సన్నిహితులు మరింత కుంగి పోతున్నారు. (కన్నీటిపర్యంతమైన అర్జున్‌)

చిరంజీవి, మేఘనా రెండేళ్ల డేటింగ్ తర్వాత వివాహం చేసుకున్నారు. అట్టగర చిత్రంలో ఇద్దరూ కలిసి నటించారు. వారి వివాహం ఏప్రిల్ 29, 2018న కోరిమంగళంలోని సెయింట్ ఆంటోనీ చర్చిలో జరిగింది. మే 2న బెంగళూరు ప్యాలెస్ మైదానంలో రిసెప్షన్‌ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఇదిలా ఉండగా చిరంజీవి అంత్యక్రియలు కనకపుర రోడ్డులోని నెలగోళి గ్రామంలోని ఫాంహౌస్‌లో  సోమవారం సాయంత్రం ఐదు గంటలకు ముగిశాయి. ఒక్కలిగ సంప్రదాయం ప్రకారం  జరిపారు.

మరిన్ని వార్తలు