బెదిరింపులకు భయపడను

3 May, 2018 10:34 IST|Sakshi

తమిళసినిమా: ఎలాంటి బెదిరింపులు వచ్చినా భయపడనని సీనియర్‌ దర్శకుడు, నటుడు విజయ్‌ తండ్రి ఎస్‌ఏ.చంద్రశేఖరన్‌ అన్నారు. ఈయన సమాజంలోని అక్రమాలు, అన్యాయాలపై అలుపెరుగని పోరాటం చేస్తున్న ట్రాఫిక్‌ రామస్వామి జీవిత చరిత్రతో ఆయన పేరుతోనే తెరకెక్కుతున్న చిత్రంలో ఆయన పాత్రలో నటిస్తున్నారు. ఎస్‌ఏ.చంద్రశేఖరన్‌ శిష్యుడు విక్కీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర మోషన్‌ పోస్టర్, టీజర్‌ ఆవిష్కరణ కార్యక్రమం మంగళవారం సాయంత్రం చెన్నైలోని ప్రసాద్‌ల్యాబ్‌లో జరిగింది. 

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎస్‌ఏ.చంద్రశేఖరన్‌ మాట్లాడుతూ తన వద్ద సహాయ దర్శకుడిగా పని చేసిన విక్కీ ఇక రోజు ట్రాఫిక్‌ రామస్వామి జీవిత కథను స్క్రిప్ట్‌గా తయారు చేసి తనకు ఇచ్చారన్నారు. కథను చదవిన తరువాత ట్రాఫిక్‌ రామస్వామి తనలాగే సమాజంలో జరిగే అన్యాయాలను చూసి రగిలే మనిషి అని తెలిసిందన్నారు. ఎక్కడ తప్పు జరిగినా ఆగ్రహించే ఆయన మనస్తత్వం తనకు నచ్చిందని పేర్కొన్నారు. ఆయన పోరాటాలు తెలిసి విస్మయం చెందానన్నారు. అందుకే ఈ చిత్రంలో నటించాలని విక్కీ కోరినప్పుడు కాదనలేకపోయానని చెప్పారు. 

తాను 45 ఏళ్లలో 69 చిత్రాలకు దర్శకత్వం వహించానని, అలాంటి తానే ఏం సాధించాననడానికి చిహ్నంగా ఈ చిత్రం నిలిచిపోతుందని అన్నారు. ఇందులో తనకు జంటగా రోహిణి నటించగా హీరోలాంటి పాత్రలో ఆర్‌కే.సురేశ్‌ నటించారని చెప్పారు. ఇక ఒక్క సన్నివేశంలో నటించడానికి విజయ్‌ ఆంథోని, కుష్బు, సీమాన్‌ అంగీకరించారని తెలిపారు. వివాదాస్పదమైన ఈ చిత్రంలో నటించినందుకు ఎలాంటి బెదిరింపులు వచ్చినా భయపడనని, తన తొలి చిత్రం చట్టం ఒరు ఇరుట్టరై సమయంలోనే చాలా బెదిరింపులు ఎదుర్కొన్నానని ఎస్‌ఏ.చంద్రశేఖరన్‌ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు