సినిమా వేడుకకు రావడం ఇదే తొలిసారి! - కపిల్ దేవ్

20 Nov, 2013 23:30 IST|Sakshi
సినిమా వేడుకకు రావడం ఇదే తొలిసారి! - కపిల్ దేవ్
 భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, ఆల్‌రౌండర్ కపిల్‌దేవ్ బుధవారం హైదరాబాద్‌లో ఓ తెలుగు సినిమా ఆడియో వేడుకలో పాల్గొన్నారు. ఆ సినిమా పేరు ‘దిల్ దివానా’. శేఖర్ కమ్ముల శిష్యుడు తుమ్మా కిరణ్‌ని దర్శకునిగా పరిచయం చేస్తూ, రాజారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కపిల్ దేవ్ మాట్లాడుతూ -‘‘ఈ చిత్రంలో నటించిన నటీనటులు, పనిచేసిన సాంకేతిక నిపుణులందరూ యంగ్‌స్టర్సే. వీళ్లందర్నీ ప్రోత్సహించడానికే ఈ సమావేశంలో పాల్గొన్నాను. ఇన్నేళ్ల క్రికెట్ చరిత్రలో ఎప్పుడూ నేను ఏ సినిమా వేడుకకూ హాజరు కాలేదు. నా కెరీర్‌లో ఇదే తొలిసారి... ఇలాంటి వేడుకలకు రావడం.
 
 ఈ మధ్యకాలంలో దక్షిణాది చిత్రాలు దాదాపు హిందీలోకి అనువాదమవుతున్నాయి. ఈ సినిమా కూడా హిందీలోకి అనువాదమైతే తప్పకుండా చూస్తా’’ అని చెప్పారు. ఈ చిత్రాన్ని ప్రమోట్ చేయడానికి కపిల్‌దేవ్ విచ్చేయడం స్వీట్ షాక్‌లా ఉందని, ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని దర్శకుడు కిరణ్ తెలిపారు. ఈ చిత్రంలో నటించిన రోహిత్‌రెడ్డి, రాజ్‌అర్జున్, కృతికా సింఘాల్, నేహా దేశ్‌పాండే తదితరులు కపిల్‌దేవ్‌కి కృతజ్ఞతలు తెలియజేయడంతోపాటు చిత్రవిజయం పట్ల తమ నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఈ చిత్రానికి మాటలు: నారాయణబాబు, సంగీతం: రామ్‌నారా యణ్, కెమెరా: జైపాల్‌రెడ్డి, ఎడిటింగ్: కార్తీక్ శ్రీని వాస్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: సాయికృష్ణ.
 
 ‘భారతరత్న’కి సచిన్ అర్హుడు
 ‘‘క్రీడారంగం నుంచి భారతరత్న అందుకున్న మొట్టమొదటి ఆటగాడు సచిన్ టెండూల్కర్. అందులోనూ ఆ ఆటలో నేనూ ఓ భాగం కావడం ఆనందంగా ఉంది.  సచిన్‌కి ఈ అరుదైన గౌరవం దక్కినందుకు గర్వంగా ఉంది. తను దీనికి అర్హుడు’’ అని కపిల్‌దేవ్ ప్రత్యేకంగా చెప్పారు.
 
>