అందాల సత్యభామ

3 Feb, 2019 11:01 IST|Sakshi

‘కీచక’ సినిమాతో వెండితెరకు పరిచయమైన యామిని భాస్కర్‌ పదహారణాల తెలుగు అమ్మాయి. ‘నర్తనశాల’ సినిమాలో సత్యభామగా ఆకట్టుకుంది. ‘‘నా తెలుగు మూలాలే నా బలం’’ అంటున్న యామిని తన గురించి తాను చెప్పుకున్న విషయాలు....

నేను లోకల్‌ .. విజయవాడలో పుట్టిపెరిగాను. సినిమా ఇండస్ట్రీ గురించి ఏమీ తెలియదు. కాలేజీకి బంక్‌ కొట్టి సినిమాకు వెళ్లిన సందర్భాలు ఎప్పుడూ లేవు.  సినిమాల్లోకి రావాలని ఎప్పుడూ అనుకోలేదు. ఇప్పుడు మాత్రం సినిమాలంటే ప్యాషనేట్‌గా ఉన్నాను. దేవదాస్‌ కనకాలగారి దగ్గర నటనలో ఓనమాలు నేర్చుకున్నాను.

ఎంత ఇష్టమంటే... కథానాయికలలో నా అభిమాన తార సమంత. క్యూట్‌ అండ్‌ గ్రేట్‌ పర్‌ఫార్మెన్స్‌. చిన్నప్పటి నుంచి చిరంజీవి సినిమాలు చూస్తూ పెరిగాను. ఆయన కామెడీ డైలాగులు బాగా ఎంజాయ్‌ చేస్తాను. నవ్వించడమైనా, ఏడ్పించడమైనా, డ్యాన్స్‌ అయినా ఎంత బాగా చేస్తారో! ఆయన్ని ఆరాధించేంత అభిమానం.

నా డ్రీమ్‌రోల్‌.. నా డ్రీమ్‌రోల్స్‌ చాలా ఉన్నాయి. ‘నరసింహ’ సినిమాలో రమ్యకృష్ణ చేసిన ‘నీలాంబరి’లాంటి బలమైన పాత్ర చేయాలని ఉంది. మరి అలాంటి సినిమా వస్తుందో లేదో తెలియదుగాని చేయాలని మాత్రం ఉంది. ఎప్పుడు ఎలాంటి పాత్ర వస్తుందో తెలియదు. అలాని ‘డెస్టినీ’ గురించి పెద్దగా ఆలోచించను. ‘జస్ట్‌ హ్యాపన్‌’ అనే అనుకుంటాను.

వరం.. ప్రేమ అన్నిసార్లూ దొరకదు. అది దొరికితే జీవితాంతం ఉంటుంది. అది పేరెంట్స్‌ నుంచి దొరకవచ్చు, ఫ్రెండ్స్‌ నుంచి దొరకవచ్చు. దేవుడు ప్రత్యక్షమై ‘వరం కోరుకో’ అని అడిగితే...‘‘ఈ సమాజంలో  ఎన్నో అంతరాలు ఉన్నాయి. అలాంటివి లేకుండా, ఎలాంటి గొడవలు లేకుండా అందరూ సుఖశాంతులతో ఉండే సమాజం కావాలి’’ అని అడుగుతాను.

చిన్నప్పుడు .. చిన్నప్పుడు మా ఇంట్లో అద్దం మీద మహేష్‌బాబు ఫొటో ఉండేది. పన్నెండేళ్ల వయసులోనే కూచిపూడి డ్యాన్స్‌ నేర్చుకున్నాను. నన్ను నటిగా చూడాలనేది మా నాన్న కల. నా ఇష్టమైన వంటకం...అన్నం, పప్పు, ఆవకాయ. ఇష్టమైన ప్రదేశం... స్విట్జర్లాండ్‌. 

మరిన్ని వార్తలు